నారాయణకు సీన్ అర్ధమైపోయిందా ?

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసిన మంత్రి పొంగూరు నారాయణకు సీన్ అర్ధమైపోయినట్లుంది. రాబోయే ఫలితాల్లో గెలుపు విషయంలో స్పష్టమైన అవగాహనే ఉన్నట్లుంది మాటలు చూస్తుంటే. మీడియాతో మంత్రి మాట్లాడుతూ తన ప్రత్యర్ధి, వైసిపి అభ్యర్ధి చాలా బలవంతడని అంగీకరించారు.  ప్రత్యర్ధి ఎప్పుడూ జనాల్లోనే ఉంటాడని, గడచిన ఐదేళ్ళుగా నియోజకవర్గంలో బాగా పాతుకుపోయినట్లు కితాబిచ్చారు. నిజానికి ప్రత్యర్ధికి మంత్రి కితాబివ్వటం అంటే గొప్పే.

జనాధరణ రీత్యా, సమస్యలపై పోరాడే విషయంలో వైసిపి అభ్యర్ధి, సిట్టింగ్ ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాదవ్ కు తిరుగులేని ఇమేజి ఉంది. ఇక్కడ బలవంతుడంటే మంత్రి ఉద్దేశ్యంలో జనాధరణలోనే అయ్యుంటుంది. ఆర్ధిక, అంగ బలాల విషయంలో మంత్రి ముందు అనీల్ ఎందుకు పనికిరాడనే చెప్పాలి.

గడచిన ఐదేళ్ళల్లో నియోజకవర్గంలో మౌళిక సదుపాయల కల్పన,  పేదలకు ఇళ్ళు, రేషన్ కార్డులు, పెన్షన్ల లాంటి అనేక సమస్యలపై అనిల్ జనాల తరపున పెద్ద పోరాటాలే చేశారు.  ఇక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ముందు అనీల్ తేలిపోయారు. మంత్రి అవసరానికి మించే డబ్బులు పంపిణీ చేశారనే ప్రచారం విపరీతంగా జరిగింది.

కాకపోతే మంత్రి చేసిన ఖర్చంతా దాదాపు వృధాగా పోయిందనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే, ఎవరైని అయితే నమ్మి మంత్రి డబ్బిచ్చారో వాళ్ళెవరూ  జనాలకు డబ్బులు పంచలేదని సమాచారం. చివరగా మంత్రి మాటలు వింటుంటే రేపటి గెలుపు ఎవరిదో అర్ధమైపోతోంది.