శాంతిభద్రతలపై శ్వేతపత్రం… చంద్రబాబు వెనక్కి తగ్గింది అందుకేనా?

ఏదైనా ఓ విషయంపై మనం మాట్లాడాలంటే… మితిమీరిన పరిజ్ఞానం లేకపోయినా కనీసం అవగాహనతో పాటు కనీస నైతికత ఉండాలి! అలాకాని పక్షంలో జనాల్లో చులకన అయిపోతారు.. ప్రజల్లో పలచన అయిపోతారు. అయితే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? తెలుసు! అందుకే ఆయన ఏపీలో శాంతిభద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల అని వెనక్కి తగ్గారు!

అవును… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ సూపర్ సిక్స్ హామీల సంగతేమో కానీ… గత ప్రభుత్వ పాలనపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. వీటి ద్వారా గత పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది అందుకు కాదు.. మేలు చేస్తారాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తారని అని గ్రహించలేకపోతున్నట్లున్నారు!

ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఘాటు వ్యాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ… చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు.. శ్వేతపత్రం విడుదల వాయిదా వేశారు. దీంతో… శాంతి భద్రతలపై ప్రస్తుతం శ్వేతపత్రం ఇచ్చే నైతిక హక్కు తనకు లేదని చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకున్నారా.. లేక, ఎవరైనా చెప్పారా అనేది ఆసక్తిగా మారింది.

చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు అన్నీ ఇన్నీ కాదని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, వారి ఆస్తులపై దాడులు, నడి రోడ్డుపై భౌతిక దాడులు పెట్రేగిపోయాయి. ఇక మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు తెరపైకి వచ్చాయి.

నంద్యాలలోని 8ఏళ్ల బాలిక హత్యాచారం విషయంలో ఇప్పటివరకూ మృతదేహం కూడా లభ్యం కాలేదు. దీంతో… కూటమి ప్రభుత్వం చేతకాని తనం అంటూ తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పైగా శాంతిభద్రతలు అంటే ఏమిటో చూపిస్తానంటూ అప్పట్లో తెగ ప్రసంగాలు చేసిన పవన్ కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఈ ఘటనలపై స్పందించకుండా జారుకుంటున్నారని చెబుతున్నారు.

కాగా… నంద్యాలతో పాటు విజయనగరంలో ఐదేళ్ల బాలిక, గుంటూరులో 13 ఏళ్ల బాలిక, తిరుపతిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక వినుకొండలో వైసీపీ కార్యకర్తపై నడిరోడ్డులో జరిగిన అత్యంత పాశవిక దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే… నిస్సిగ్గుగా పలువురు ప్రభుత్వం పెద్దలు.. దీనికి పార్టీ ముడిపెడుతునారనే కామెంట్లు వినిపిస్తున్న వేళ… దీన్నీ పార్టీలకు అతీతంగా చూడాల్సిన ఘటన అని హితబోద చేస్తున్నారట ప్రజానికం!

ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వాన్ని తిడుతూ శ్వేతపత్రం విడుదల అంటే… జనాలు ఎలా నవ్వాలో అలా నవ్వుతారు, ఎలా చీత్కరించాలో అలా చీత్కరిస్తారని భావించారో ఏమో కానీ… శాంతిభద్రతలపై శ్వేతపత్రం విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది.. వెనకడుగు వేసింది! వాస్తవానికి శ్వేతపత్రంలో గత ప్రభుత్వ తప్పుల్ని ఎంచి ప్రజల ముందు పెడుతుంటారు. అయితే… ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాబు ఆ సాహసం చేయలేకపోయారు!!

కారణం… మరి మీ పరిస్థితి ఏమిటి..? అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లో జరిగిన అరాచకాల సంగతి ఏమిటి..? అని జనం నిలదీసే అవకశం పుష్కలంగా ఉండటంతో… శాంతిభద్రతలపై శ్వేతపత్రానికి ఇది ఏమాత్రం అనుకూల సమయం కాదని బాబు వెనక్కి తగ్గారని అంటున్నారు! సీనియర్ కదా!!