ఒక్క రోజైనా రామోజీరావులా బతకాలని తన భార్య చెప్పిందని ఆస్కార్ అవార్డు గెల్చుకున్న సంగీత దర్శుకుడు కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆస్కార్ సాధించుకుని వచ్చిన సందర్భంగా టాలీవుడ్ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో కీరవాణి ఈ వ్యాఖ్యలు చేశారు. అది అసందర్భ ప్రేళాపణా, లేక అభిమానానికి నిదర్శనమా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా ఈ విషయాలపై ఫ్లోలో పంచ్ వేశారు ఉండవల్లి అరుణ్ కుమార్!
“రామోజీరావు మార్గదర్శి అక్రమాలు – నిజానిజాలు” అనే అంశంపై విజయవాడలో స్వర్ణాంధ్ర పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఉండవల్లి సంచలన విషయాలు చెబుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా.. చిన్నపిల్లలకు కథలు చెబుతున్నంత అర్ధమయ్యేలా.. మార్గదర్శి లో ఏమి జరిగింది.. ఈనాడు పత్రిక ఎంత సంకుచితంగా వ్యవహరిస్తుంది అనే విషయాలపై స్పష్టంగా తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు.
పలువురు ప్రముఖులు, న్యాయ కోవిదులు పాల్గొన్న ఈ సభలో ప్రసంగించిన ఉండవల్లి అరుణ్ కుమార్… రాజమండ్రిలో తాను రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీచేస్తున్న సమయంలో.. రెగ్యులర్ గా ఆ స్థానం నుంచి పోటీచేసే నాయకుల ఫోటోలు, పోటీచేస్తున్న పార్టీ, మిగిలిన వివరాలతో అచ్చేసేవారు. అయితే… అన్ని నియోజకవర్గాలకు అన్ని పార్టీలపేర్లూ వేసిన ఈనాడు… రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి… ఆ రోజు పత్రికలో తన పేరు – తన పార్టీ పేరు తప్ప మిగిలిన ముగ్గురు పేర్లు వేస్తూ… వీరి ముగ్గురు మధ్యే పోటీ అన్నంతలా రాసుకొచ్చారని చెప్పుకొచ్చారు.
అప్పటికి తాను సిట్టింగ్ ఎంపీ అయినా కూడా తన పేరును సైతం వారు పరిగణలోకి తీసుకోలేదని… ఇది ఈనాడు సంకుచిత మనస్థత్వానికి నిదర్శనమని రామోజీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా… రామోజీరావు ఆగ్రహిస్తేనో, ఈనాడు పత్రికల్లో వ్యతిరేకంగా రాస్తేనో ఏదో జరిగిపోయే రోజులు పోయాయని… తనపేరు కూడా అచ్చేసే ఆలోచన చేయని ఆ ఎన్నికల్లో… ఆ ముగ్గురిని కాదని తాను గెలిచానని… రామోజీ చెప్తేనో, ఈనాడు రాస్తేనో ఏదో జరిగిపోతుందని, ప్రజలంతా గుడ్డిగా నమ్మేస్తారనే ఆలోచన చాలామందికి ఆనాడే పోయిందని ఉండవల్లి క్లారిటీ ఇచ్చారు.
ఇదే క్రమంలో… రామోజీ తనకు తాను స్వయంగా చట్టాన్ని ఉల్లంగించాను అని ఒప్పుకుంటూనే, తనకు ఆ చట్టాలు వర్తించవన్నంతగా మాట్లాడతారని, దేశం మీద, దేశంలోని చట్టాల మీద గౌరవం లేని వ్యక్తని, సంకుచిత మనస్కుడని తెలిపారు. విచిత్రంగా చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు… రామోజీలా బ్రతకాలని స్టేట్ మెంట్స్ ఇస్తుంటారని పరొక్షంగా కీరవాణికి సెటైర్స్ వేశారు. దీంతో… కీరవాణి కామెంట్లు మరోసారి తెరపైకి వచ్చాయి.
ఏది ఏమైనా… అటు రామోజీ పైనా, ఆయన అక్రమాలపైనా.. అలాంటి వ్యక్తిని గుడ్డిగా సమర్ధిస్తున్న ప్రముఖులపైనా ఉండవల్లి సంధించిన బాణాలు, వేసిన సెటైర్లు ప్రస్తుతం రాజకీయవర్గాలతో పాటు, సాధారణ ప్రజానికంలో కూడా హాట్ టాపిక్ గా మారాయి!