విశాఖలో జనసేనాని రగడ.! చిరంజీవిని రంగంలోకి దించుతున్నారా.?

Vishaka Gharjana

Vishaka Gharjana Vs Pawan Kalyan – మెగాస్టార్ చిరంజీవి తాను రాజకీయాలకు దూరమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మరి, జనసేనాని పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా మద్దతిస్తారా.? అంటే, ‘ఏమో, ఇవ్వొచ్చేమో.. వాడు నా తమ్ముడు.. నిబద్ధత, నిజాయితీ కలిగినోడు..’ అని ఇటీవలే చిరంజీవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాంతో, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాననీ, సినిమాల్లోనే వుంటానని ఇంకాస్త స్పష్టత ఇచ్చేశారు. మద్దతు విషయంలోనే చిరంజీవి, ఒకింత తమ్ముడి పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం వుంది.

ఇదిలా వుుంటే, విశాఖ వేదికగా జనసేన హంగామా కొనసాగుతోంది. అధికార వైసీపీ ఈ విషయంలో కొంత అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం. లైట్ తీసుకోవాల్సిన జనసేన కార్యక్రమం కాస్తా.. ఇప్పుడు కొరకరాని కొయ్యిలా తయారైంది. పవన్ కళ్యాణ్, నోవాటెల్ హోటల్‌లోనుంచే కథ నడిపిస్తున్నారు. జనసైనికులేమో, పోలీసుల హెచ్చరికల్ని లెక్క చేయకుండా నిద్రాహారాలు మానేసి.. అధినేత బస చేసిన హోటల్ చుట్టూనే చక్కర్లు కొడుతున్నారు.. ‘మా నాయకుడ్ని కాపాడుకుంటాం..’ అని నినదిస్తున్నారు.

చిన్నపాటి తొందరపాటు ఎవరు ప్రదర్శించినా, పరిస్థితి చెయ్యిదాటిపోతుంది. ప్రస్తుతం విశాఖలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా వుంది. ‘పవన్ కళ్యాణ్ అరెస్టు..’ అన్న ఉదంతమొక్కటి రాలు, అప్పటికప్పుడు పరిస్థితులు అదుపు చేయలేని స్థాయికి దిగజారిపోతాయ్.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ ఆ హోటల్‌లో వుండిపోయారంటేనే, దానర్థం.. పరిస్థితి గంభీరతను ఆయన అర్థం చేసుకున్నారని. అదే సమయంలో తనను విశాఖ నుంచి వెళ్ళిపోమని వైసీపీ హెచ్చరించడం, పోలీసులూ అదే కోణంలో నోటీసులు జారీ చేయడంతో.. పవన్ కళ్యాణ్ అక్కడే అదే హోటల్‌లో భీష్మించుక్కూర్చున్నారు.

ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ని ఒప్పించి, విశాఖ నుంచి ఆయన బయటకు వెళ్ళేలా చేసేదెవరు.? ఆ శక్తి ప్రస్తుతానికి చిరంజీవికి మాత్రమే వుందని నమ్మతున్న వైసీపీ పెద్దలు కొందరు, ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై మెగా కాంపౌండ్ వర్గాలు పెదవి విప్పడంలేదు. ‘చిరంజీవికి రాజకీయాలతో సంబంధం లేదు’ అని మాత్రమే మెగా కాంపౌండ్ వర్గాల నుంచి స్పందన వస్తోంది.

కానీ, ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో చిరంజీవి మాట్లాడారనీ, నాగబాబు కూడా అక్కడే వున్న దరిమిలా.. చిరంజీవి ఇద్దరితోనూ మాట్లాడుతున్నారనీ తెలుస్తోంది. ఇంతకీ, చిరంజీవిని రంగంలోకి దించిన ఆ వైసీపీ కీలక నేతలు ఎవరు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.