చంద్రబాబుకి విజయసాయిరెడ్డి బర్త్ డే గ్రీటింగ్స్.!

అన్నగారికి తమ్ముడిగారు చెప్పిన ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.! ఆ అన్నగారేమో చంద్రబాబు.. తమ్ముడుగారేమో విజయసాయిరెడ్డి. అదేంటీ, టీడీపీ అధినేత చంద్రబాబు అంటే అస్సలు గిట్టని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ చెప్పడమేంటి.?

నిజానికి, ఇందులో ఆక్షేపించడానికేమీ లేదు. వైఎస్ జగన్ కూడా చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. రాజకీయాల్లో ఇదో హుందాతనమైన ప్రక్రియ. చెప్పాలనే రూల్ ఏమీ లేదు.. కాకపోతే, ఆరోగ్యకరమైన రాజకీయమిది.!

అయితే, విజయసాయిరెడ్డి వ్యవహారం వేరు. చంద్రబాబుని వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా పలుమార్లు దూషించారాయన. అదీ అత్యంత జుగుప్సాకరంగా.! చంద్రబాబేమన్నా తక్కువ తిన్నారా.? ‘దొంగా..’ అంటూ చాలా సందర్భాల్లో విజయసాయిరెడ్డినీ తూలనాడారు.

అవన్నీ గతం.! తారకరత్న వ్యవహారంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిసిపోయారు. కలవక తప్పదు. తారకరత్న బంధువు చంద్రబాబు, తారకరత్న భార్యకి బంధువు విజయసాయిరెడ్డి.. అలా తారకరత్న విషయంలో (వైద్యం, అంత్యక్రియలు వంటి విషయాల్లో) చంద్రబాబు, విజయసాయిరెడ్డి పెద్దరికంతో వ్యవహరించారు.

ఆ తర్వాతి నుంచీ చంద్రబాబుపై ఎక్కడా విజయసాయిరెడ్డి విమర్శలు చేయలేదు. ఇప్పుడేమో, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మరింత హుందాతనంతో కూడిన శుభాకాంక్షలు చెప్పారు విజయసాయిరెడ్డి. అందుకే డౌటానుమానాలు వస్తున్నాయ్.!