మాట ఇవ్వడం సులువే…! అవసరం కోసం, ఆ పూట గడవడం కోసమో, జనాలతో అప్పటికి శభాష్ అనిపించుకోవడం కోసమో… మాట ఇవ్వడం సులువే! “నేను మాట ఇస్తే అది తప్పే మనిషిని కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఎంతదూరమైనా వెళ్తాను.. ఆ మాట నిలబెట్టుకోలేమోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది” వంటి కబుర్లు చాలా మంది నేతలు బహిరంగ సభల్లో మైకుల ముందు చెబుతుంటారు. కానీ.. చేతల దగ్గరకు వచ్చేసరికి సైడై పోతుంటారు.
వారాహి యాత్రలో భాగంగా… పవన్ కల్యాన్ వెస్ట్ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో తణుకు నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థే పోటీ చేస్తారని ప్రకటించారు. కట్ చేస్తే తాజాగా టీడీపీ – జనసేన ప్రకటించిన అభ్యర్థుల ఉమ్మడి జాబితాలో తణుకు నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో… వేల మంది ప్రజానికం ముందు, జనసైనికుల ముందు, వీర మహిళలల ముందు పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నీటి మూట, గాలి మాట అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో నువ్వే అభ్యర్థివి అని వేల మంది ముందు మాట ఇస్తే ఏ అభ్యర్థి అయినా ఏమి చేస్తారు? నియోజకవర్గం మొత్తం తిరుగుతూ, ప్రచారం చేసుకుంటూ, అవసరం అన్నవారికి సాయం అందిస్తూ, ప్రజలను మచ్చిక చేసుకుంటారు!! ఈ సమయంలో సమయంతోపాటూ ఎంతో ఆర్ధిక భారం కూడా మోయాల్సి వస్తుంది. తణుకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు అదే చేశారు.. అవే పడ్డారు. పవన్ మాట ఇస్తే తప్పడు కదా అని నమ్మాడు!
అయితే సినిమా డైలాగులకూ, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని.. అందుకు పవన్ కల్యాణ్ ఏమీ అతీతుడు కాదని.. ప్రచారంలోనూ, బహిరంగ సభల్లోనూ నిలబెట్టుకోలేని మాటలు చెప్పడంలో పవన్ కూడా ఆరితేరిపోయారని తాజాగా రామచంద్రారావుకి తెలిసిందని అంటున్నారు. కారణం… తాజాగా ప్రకటించిన అభ్యర్థుల తొలిజాబితాలో తణుకు నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించుకున్నారు.
దీంతో… తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, పలువురు నేతలు, కార్యకర్తలు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను కలవడానికి వెళ్లారు. దీంతో విషయం గ్రహించిన మనోహర్… హోటల్ గది నుంచి బయటకు రాకుండా.. లోపలే ఉండి తలుపు గడియపెట్టుకున్నారని అంటున్నారు. దీంతో… మనోహర్ బస చేసిన గెస్ట్ హౌస్ ఎదుట తణుకు జనసైనికులు నిరసన వ్యక్తం చేశారు.
దీంతో విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్ అక్కడకు చేరుకుని, విడివాడ రామచంద్రరావును వారు సముదాయించే ప్రయత్నం చేసినా… ఆయన వారి మాటను తీసిపారేశారని అంటున్నారు. ఇలా బయట ఎంత హడావిడి జరుగుతున్నా… నిన్న మొన్నటి వరకూ తణుకు వస్తే అన్నీ తానై చూసుకున్న వ్యక్తి రోడ్డుపై నిలబడ్డా కూడా మనోహర్ బయటకు తొంగిచూసే ప్రయత్నం చేయలేదని సమాచారం.
దీంతో ఆగ్రహం, ఆవేశం కలగలిపిన ఎమోషన్ తో ఊహిపోయిన విడివాడ… తనకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటానంటూ గట్టిగా హెచ్చరించారు. అవసరమైతే… ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. అయినప్పటికీ మనోహర్ బయటకు వచ్చే సాహసం చేయకపోవడంతో… చెప్పాలనుకున్న విషయం చెప్పిన విడివాడ… అనుచరులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు! దీంతో… తణుకులో సరికొత్త టెన్షన్ తెరపైకి వచ్చింది.