టిడిపిలో మూడు పెద్ద వికెట్లు డౌన్..చంద్రబాబులో టెన్షన్

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టిడిపిలోని పెద్ద వికెట్లు పడిపోతున్నాయి. అందులోను పార్టీకి బాగా మద్దతుగా నిలబడిన తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే మూడు పెద్ద వికెట్లు పడిపోవటంతో పార్టీలో కలకలం రేగుతోంది. తాజగా రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ కూడా పోటీ నుండి తప్పుకంటున్నట్లు ప్రకటించారు. ఎంపి ప్రకటనతో పార్టీలో సంచలనం మొదలైంది. పోటీ నుండి తప్పుకుంటున్నందుకు ఎంపి చెబుతున్న కారణాలు నమ్మదగ్గవిగా లేకపోవటంతో ఎంపి నిర్ణయంపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.

జిల్లాలో మూడు లోక్ సభ సీట్లున్నాయి. అందులో అమలాపురం ఎంపి పండుల రవీంద్ర టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. తర్వాత కాకినాడ ఎంపి తోట నర్సింహం రాబోయే ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణాలతోనే తాను ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు చెప్పినా ఎవరూ నమ్మటం లేదు. పైగా జగ్గంపేటలో తన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని పట్టుపట్టడంతో తోట వైఖరిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే, తోట వైసిపిలో చేరుతారని ప్రచారం జరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.

రవీంద్ర, తోట దెబ్బనే తట్టుకోలేకపోతుంటే తాజాగా మురళీ మోహన్ చేసిన ప్రకటనతో చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి వరకూ ఎంపిగా తానే పోటీ చేస్తానంటూ మురళీ పట్టుపట్టారు. ఏ కారణం చేతనైనా తాను పోటీ చేయలేకపోతే తనకు బదులు తన కోడలు రూపకే టికెట్ ఇవ్వాలని ఎంపి చంద్రబాబును కోరారు.

అయితే తాజాగా తామిద్దరమూ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. మూడు కీలక స్ధానాలు ఒక్కసారిగా ఖాళీ అయిపోవటంతో ప్రత్యామ్నాయాలు వెదకటం అంత ఈజీ కాదు. అయితే, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై నమ్మకం లేకే సీనియర్లందరూ పోటీకి దూరమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఇంకెతమంది సీనియర్లు పోటీకి దూరమవుతారో చూడాల్సిందే.