తెలంగాణలో జనసేనకు ప్రాధాన్యత లేనట్టేనా.. బీజేపీ అవమానించిందా?

రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చేసిన అతిపెద్ద తప్పు ఏదనే ప్రశ్నకు ఆయన తెలుగుదేశంతో కలిసి రాజకీయాలు చేయడం అని సమాధానం వినిపిస్తుంది. 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుతో టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చినా టీడీపీ వల్ల జనసేనకు పెద్దగా బెనిఫిట్ కలగలేదు. 2019 ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ జనసేనకు అనుకూలంగా వ్యవహరించింది. అయితే పరోక్షంగా సహకారం అందించుకోవడం అటు టీడీపీకి జనసేనకు ప్లస్ కాలేదు.

వైసీపీని ఓడించడం మాత్రమే పవన్ లక్ష్యమైతే 2024 ఎన్నికల్లో సైతం పవన్ టీడీపీతో కలిసి తమ పార్టీని పోటీ చేయించే ఛాన్స్ ఉంది. అయితే బీజేపీతో జనసేన పొత్తుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకు బీజేపీ జనసేన పొత్తులో ఉన్నా ఒక పార్టీ అభిప్రాయాలను గౌరవించడానికి మరో పార్టీ సిద్ధపడటం లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉన్నా అక్కడ ఆ పార్టీ పరిస్థితి ఏపీ కంటే దారుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మినహా సామాన్య ప్రజలు అక్కడ జనసేన పార్టీని పట్టించుకునే పరిస్థితులు ఏ మాత్రం లేవని చెప్పవచ్చు. బీజేపీ ప్రస్తుతం తమకు ప్రయోజనం చేకూర్చే పార్టీలకు తాత్కాలికంగా ప్రాధాన్యతనిస్తోంది. బీజేపీ విషయంలో పవన్ ఏదో ఒకటి తేల్చుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్డీయేలోకి తెలుగుదేశం వస్తుందనే ప్రచారంలో కూడా నిజం లేదని బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీ జనసేన పొత్తు ఏపీకే పరిమితమని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు భవిష్యత్తు లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టకపోతే మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ కు ఊహించని స్థాయిలో నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.