కల్లుగీత కార్మికులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇకపై వారికి రెట్టింపు పరిహారం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో కొత్త పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే అమ్మవడి పథకం ద్వారా పేద విద్యార్థులకు సంవత్సరానికి 15000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరికొన్ని జబ్బులకు ఉచితంగా చికిత్స అందించనుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రతి సంవత్సరం 18 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇలా వివిధ రకాల పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటుంది.

ఇక ఇటీవల జగన్ సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా కల్లు గీత కార్మికులు లాభం పొందనున్నారు. ఈ పథకం ద్వారా కల్లు గీత కార్మికులు మరణిస్తే ప్రభుత్వం నుండి రెట్టింపు పరిహారాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారం కల్లుగీత కార్మికులు మరణిస్తే ప్రభుత్వం నుండి వారి కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం అందుతుంది. అయితే జగన్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా మరణించిన కల్లుగీత కార్మికుడు కుటుంబానికి 10 లక్షల వరకు పరిహారం పెంచినట్లు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందవచ్చు.

అదేవిధంగా ప్రస్తుతం అమలులో ఉన్న ఇతర పథకాల ద్వారా కూడా కల్లు గీత కార్మికులను ఆదుకుంటామని తన నూతన విధానంలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా వైఎస్ఆర్ బీమా పథకాన్ని కూడా కల్లుగీత కార్మికులకు వర్తింపచేసేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కల్లు గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న తాటిచెట్టు అద్దెను రద్దు చేస్తున్నట్లుగా కూడా కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించడమేకాకుండా ఇలా ప్రమాదానికి గురై అంగవైకల్యం చెందిన వ్యక్తులకు వైఎస్సార్‌ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నారు.