చంద్రబాబునాయుడు భయపడుతున్నట్లే మంత్రులపై ఐటి సోదాలు మొదలయ్యాయి. చంద్రబాబుకు సన్నిహితుడు, సిఎం తరపున చాలా వ్యవహారాలు చక్కపెడుతున్న మంత్రి నారాయణ విద్యాసంస్దలు, ఆస్తులపై దాడులు మొదలయ్యాయి. ఐటి శాఖకు చెందిన అధికారులు తొమ్మిది బృందాలుగా విడిపోయి నెల్లూరు, విజయవాడలోని నారాయణ సంస్ధల కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు. అదే విధంగా మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు ఇళ్ళు, కార్యాలయలపైన కూడా ఐటి అధికారులు దాడులు జరిపారు బిఎంయార్ పేరుతో బీద మస్తాన్ రావు భారీ ఎత్తున ఇరిగేషన్ కాంట్రాక్టులు చేస్తున్నారు. చంద్రబాబు సన్నిహితుల్లో బీద కూడా ఒకరన్న విషయం తెలిసిందే.
దాదాపు మూడున్నరేళ్ళ క్రితం వెలుగు చూసిన ఓటుకునోటు కేసులో తాజాగా రేవంత్ పై ఐటి దాడులు మొదలవ్వగానే టిడిపికి చెందిన పలువురు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు మాట్లాడుతూ, ఏపిలోని పలువురు మంత్రులు, నేతలపైన కూడా ఐటి దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓటుకునోటులో చంద్రబాబే అసలు సూత్రదారి కాబట్టి భయపడటంలో అర్దం ఉంది. కానీ రేవంత్ రెడ్డిపై ఐటి దాడులు చేస్తే ఏపిలో మంత్రులు, నేతలు ఆందోళన పడాల్సిన అవసరం ఏంటి ? ఏమిటంటే, అప్పట్లో రేవంత్ రూ 50 లక్షలతో పట్టుబడిన విషయం గుర్తుంది కదా ?
ఎంఎల్సీ ఎన్నికల్లో ఎంఎల్ఏ ఓటు కొనేందుకు రూ 5 కోట్లతో బేరం కుదుర్చుకున్న రేవంత్ టీమ్ అడ్వాన్సుగా రూ 50 లక్షలు ఇవ్వటానికి స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్ళినపుడు రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తీసుకెళ్ళిన 50 లక్షలు, బేరం కుదుర్చుకున్న మొత్తం 5 కోట్లు ఎవరిచ్చారు ? ఎక్కడినుండి తెచ్చారు ? అనే విషయాలు ఇప్పటికీ సస్పెన్సే. ఆ విషయాలు తెలుసుకునేందుకే ఐటి అధికారులు తాజాగా రేవంత్ అండ్ కోను విచారిస్తున్నారు.
అప్పట్లో రేవంత్ కు డబ్బు సర్దుబాటు చేసిన వాళ్ళంటూ టిడిపికి చెందిన సిఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, నారాయణ, బీద మస్తాన్ రావు పేర్లు బాగా ప్రచారంలోకి వచ్చాయి. తర్వాత తెరవెనుక ఏం జరిగిందో ఏమో అంతా కామ్ అయిపోయింది. మళ్ళీ తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వేడిలో హఠాత్తుగా ఓటుకునోటు కేసు విచారణ మొదలైంది. అప్పట్లో రేవంత్ కు డబ్బులు సర్దుబాటు చేసిన వాళ్ళపైన కూడా ఐటి దాడులు జరగచ్చని చంద్రబాబులో ఆందోళన మొదలైంది.
ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో దాడులు జరిగితే కష్టమే. అందుకే మంత్రులు, నేతలను అప్రమత్తం చేస్తున్నారు. సరే, దాడులను తప్పించుకోవటం మంత్రుల చేతుల్లో ఉండదనుకోండి అది వేరే సంగతి. దాడులు జరిగి విచారణకు మంత్రులు, నేతలను తీసుకెళితే రానున్న ఎన్నికలతో పాటు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తప్పవన్నది చంద్రబాబు భయం. మూడు రోజుల క్రితం మస్తాన్ రావు పైన ఈరోజు నారాయణ వ్యాపారాలపైన ఐటి దాడులు జరగటంతో చంద్రబాబు భయమే నిజమవుతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్.