అనంతపురానికి తుంగభద్ర నీళ్లా! ఆ ప్రాజక్టు ఆపేయండి

అనంతపురానికి తుంగభద్ర జలాలను తరలించేందుకు ఉద్దేశించిన ఎత్తి పోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యుపి సింగ్ కు లేఖ రాసింది.  తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి ఈ లేఖ రాశారు.

లేఖ సారాంశం 

40 టీఎంసీల తుంగభద్ర జలాలను అనంతపురానికి తరలించేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి ఓ జారీ చేసింది. ఇది విభజన అనంతరం జారీ చేసిన జి ఓ కాబట్టి విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు dpr నీ కృష్ణా నది మానిటరింగ్ బోర్డుకు , తెలంగాణ ప్రభుత్వానికి పంపాలి. బోర్డు పరిశీలన తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి నివేదించాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతనే ప్రాజెక్టు పనులను సాగించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవేమీ చర్యలు చేపట్టకుండా ముందుకు సాగుతున్నది. వెంటనే ప్రాజెక్టు పనులు ఆపాలని, dpr ను తమకు పంపించే ఏర్పాటు చెయ్యాలని  జోషి కేంద్ర కార్యదర్శిని ఈ లేఖలో కోరారు.

నిజానికి ఈ ప్రాజక్టుకు రూపకల్పన ఎపుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే జరిగింది. అపుడే నీటివాటాను కూడా కేటాయించారు.

ఇది ఇలా ఉంటే నిన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఇదే విషయం మీద లేఖ రాశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  నిబంధనలకు విరుద్ధంగా  సుమారు 40 టీఎంసీల తుంగభద్ర జలాలను అనంతపురానికి తరలించడానికి ప్రయత్నిస్తున్నది.  దీనికోసం ఒక ప్రత్యేక ప్రాజెక్టును నిర్మించడానికి పూనుకుంది. ఈ  ప్రాజక్టు నిర్మాణాన్ని  అడ్డుకోవాలని మంత్రి హరీశ్‌రావు నితిన్‌గడ్కరీకి లేఖ రాశారు.

ఈ ప్రాజక్టు నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అనుమతులను తీసుకోలేదని,  ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుమతిస్తే  భవిష్యత్తులో కల్వకుర్తి, ఏఎమ్మార్పీ, శ్రీశైలం ప్రాజెక్టులతోపాటు,  హైదరాబాద్‌కు తాగునీటి కొరత ఏర్పడుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.