బయట రాజకీయ పరిస్థితి చూస్తే కెసియార్, జగన్, మోదీల త్రిముఖ వ్యూహంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వూపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు కనిపిస్తుంది.
ఒకవైపు తెలంగాణా టిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెశిండెట్ కెటిరామారావు రోజూ తెలుగుదేశం మీద దాడి చేస్తున్నారు.ఈ ఎన్నికలకు సగం ప్రచారం ఆయనే చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నామధ్య విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఓడిపోతున్నాడని, జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పి పత్రికలకు హెడ్ లైన్ అందించారు.
ఇక డేటా చౌర్యం మీద ఆయనే యుద్ధం ప్రకటించారు.
ఇటువైపు సహజంగా ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రతినిధులు చంద్రబాబు మీద రోజూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ కాబట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. అది అధికారం కోసం రాజకీయం.
ఇక మూడోదిక్కునుంచి బిజెపి దాడి ప్రారంభించింది. బిజెపి నుంచి ప్రధాని ఒక సైడు, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా మరొక పక్కనుంచి దాడులు తీవ్ర చేశారు.
ఇదంతా చూస్తే చంద్రబాబు బిజెపి, జగన్, కెటియార్ చక్రవ్యూహంలో చిక్కుకున్నారనిపిస్తుంది. ఇక బయటకు రావడం కష్టమని పిస్తుంది. ఈ ఇంప్రెషన్ ను కలిగించేందుకు ఈ పార్టీలు మీడియాను, సోషల్ మీడియా ను బాగా వినియోగించుకుంటున్నాయి.
దానికి తోడు వ్యూహాత్మకంగా టిడిపి ఎంపిలను ఎమ్మెల్యేలను వైసిపిలో రోజూ ఒకరిని చేర్చుకుంటూ టిడిపి బలహీనపడుతూ ఉందని అనిపించేలా చేయడంలో జగన్ విజయవంతమయ్యారనిపిస్తుంది. టిఆర్ ఎస్, వైసిపి, బిజెపిల క్యాంపెయిన్ చూసినా , వైసిపిలో చేరుతున్న వాళ్లు చేసే ప్రకటనలు విన్నా టిడిపి చాలా దౌన్యంలో ఉందని అర్థమవుతుంది.
అయితే, టిడిపిలో కూడా ఆశాకిరణాలున్నాయి. అవి చాలా మంది సీనియర్ లకు కనిపిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టిడిపిలో ఆశాకిరణం చూశారు. ఆయన చాలా పేరున్న కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన కుటుంబం ఇపుడు టిడిపికి పెద్ద అండ అయింది.
ఈ మధ్య ప్రముఖ వైసిపి నాయకురాలు, మొన్నమొన్నటి దాకా వౌసిపి మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొల్లి నిర్మల టిడిపిలో చేరారు.
విజయవాడలో ప్రముఖ యువతరం నాయకుడు వంగవీటి రంగా కూడా టిడిపిలో చేరుతున్నారు. ఇలా ఈ వరసలో చాలా మంది సీనియర్ నాయకులు ఈ మధ్య టిడిపిలో చేరారు.
ఇపుడు ఉత్తరాంధ్ర కు చెందన ఇద్దరు ప్రముఖ నాయకులు సైకిలెక్కబోతున్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాగా, రెండో వ్యక్తి షబ్బం హరి. వీరిద్దరు మంచిపేరున్న నాయకులు. విశాఖ జిల్లాలో ఇద్దరి మంచి ఫోలయింగ్ ఉంది. ఇలాంటి వ్యక్తులు నేడో రేపో టిడిపి లో చేరుతున్నారు. మరి వారెందుకు చేరుతున్నారు?
వాళ్లకి టిడిపి భవిష్యత్తు మీద భరోసా కలిగిందనుకోవాలి. కొణతాల, షబ్బం ఇద్దరు చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రకటనలు చేసే వాళ్లు కాదు. ఇద్దరు సీరియస్ నాయకులే. ఇద్దరు ప్రచారా అర్భాటాలకు దూరంగా ఉండే వాళ్లే . వాళ్లిపుడు టిడిపి వైపు జరుగుతున్నారు. అంటే, టిడిపికి ఫ్యూచరుందని వీరు భావిస్తున్నట్టేగా…
ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే కాంగ్రెస్ మాజీ మంత్రి కొండ్రు ముళీ టిడిపిలో చేరిపోయారు. ప్రముఖులను ఆకట్టుకోవడంలో వైసిపిలాగే టిడిపి కూడా విజయవంతమవుతూ ఉంది.
నిజానికి కొణతాల, షబ్బం రాజకీయంగా వైసిపికి సన్నిహితంగా ఉండే వారు. ఇద్దరు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహతులు. అందువల్ల వాళ్లు వైసిపి వైపు వెళతారని అనుకుంటారు. అయితే, వీరిద్దరు టిడిపి లో చేరాలనుకోవడం ఉత్తరాంధ్ర టిడిపిలో ఉత్సాహాన్నిచ్చే వార్తే.
టిడిపి మునిగిపోతున్న నావ, అందుకే రఘరామ కృష్ణం రాజు, అవంతి శ్రీనివాస్ వంటి వారు టిడిపి వదిలేసి వైసిపిలో చేరారని ప్రతిపక్ష పార్టీ చెబుతూ ఉంటే, టిడిపిలో టికెట్ రాదన్న అనుమానం ఉన్నవారే వైసిపిలోకి దూకుతున్నారని టిడిపి నేతులు చెబుతున్నారు.