అవిశ్వాస తీర్మానం పుణ్యాన ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం కరుణ చూపుతున్నట్టున్నది. అవిశ్వాస చర్చలో మేం చేసిన పనులు ఇవి అవి చెప్పుకునేందుకు బిజెపి తహతహలాడుతోంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఇన్ని రోజులు పట్టించుకోకుండా తాత్సారం చేసి ఇప్పుడు ఆగమేఘాల మీద పెండింగ్ ఫైల్స్ ను క్లియర్ చేస్తుంది. ఇది బిజెపి అవిశ్వాస వేళ తాయిలాల ఎరగా చెప్పవచ్చని పలువురు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ తో టిడిపి కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రవేశ పెట్టింది. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన 4 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్‌కు సెంట్రల్ యూనివర్సిటి ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో సెంట్రల్ యూనివర్సిటి ఏర్పాటు అంశం ఉంది.
2015లోనే యూనివర్సిటి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. అనంతపురం జిల్లా జంతలూరులో 491.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలను కేటాయించి ఆ భూమి చుట్టూ ప్రహరి గోడ నిర్మించింది.నాలుగేళ్ల క్రితమే అన్ని సిద్దమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉలుకుపలుకు లేకుండా వ్యవహరించాయి.
అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం సభలో చర్చ ఉండటంతో దానిలో కేంద్రం చేసిన పనులను, ఇచ్చిన నిధులను తెలిపే అవకాశం ఉంది. అందుకే బిజెపి తాయిళంగా యూనివర్సిటి బిల్లుపై హడావుడిగా ఆమోద ముద్ర వేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా పట్టించుకోని కేంద్రం ఇప్పుడే దీనిపై నిర్ణయం తీసుకుందంటే దీనిని అవకాశంగా వాడుకుందామనే ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చు. చంద్రబాబు కూడా నాలుగేళ్లుగా దీనిపై పెద్దగా ఒత్తిడి తేలేదు.
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటికి ఆమోదిస్తున్నట్టు కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రెండు నెలల్లో యూనివర్సిటిలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. రెండు నెలల్లోనే యూనివర్సిటిని కట్టి తరగతులు కూడా ప్రారంభిస్తారట ఇది సాధ్యమేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని వారు విరుచుకుపడుతున్నారు. కేంద్రం తన స్వార్థం కోసం ప్రజలను అవమాన పరచడం సరికాదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.