పొత్తు సరే… ఏపీకి ఈ హామీలు ఇవ్వగలరా?

అంతా అనుకున్నట్లుగానే, చాలా కాలంగా చెబుతున్నట్లుగానే టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరింది. జనసేనతో కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలకు బీజేపీ పెద్దలు అంగీకరించారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ పొత్తు సందర్భంగా… కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీ అభివృద్ధి, ప్రజాక్షేమం కోసమే బీజేపీతో పొత్తు అని, ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవని చంద్రబాబు & కో చెప్పుకొస్తున్నారు.

దీంతో చంద్రబాబు & కో కు థాంక్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రజలు… ఆ ప్రయోజనాలు ఏమిటో కూడా చెప్పాలని కోరుతున్నారు. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, అవినీతి రహిత పాలన, అభివృద్ధి వంటి మాటలు చెబుతూ ఊకదంపుడు ఉపన్యాశాలు ఇస్తే జనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి.. చంద్రబాబు కూడా అదిపోగొట్టేసుకుని చాలా కాలమే అయ్యింది.

పైగా ఇదేమీ కొత్త పొత్తు కాదు! 2014లో ఒకసారి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమే! అప్పుడు కూడా ఎన్నికల సమయంలో వేదికలు ఎక్కి విక్టరీ సింబల్స్ చూపించారు. అనంతర కాలంలో వీరుడు, శూరుడు, ధీరుడు అని మోడీని పొగిడిన చంద్రబాబు… ఒక రేంజ్ లో తిట్టిపడేశారు. హ్యూ ఈజ్ మోడీ అనేవరకూ వ్యవహారం వచ్చింది.

పవన్ కల్యాణ్ కూడా ఏమీ తక్కువ తినలేదు! మోడీ & కోని తనదైన శైలిలో విమర్శించారు. రాష్ట్రానికి రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని దుయ్యబట్టారు. కట్ చేస్తే… తిరిగి ఎన్నికలు సమీపిస్తుండటంతో.. మరోసారి ఏపీ ప్రయోజనాల కోసమే కలుస్తున్నామని చెబుతున్నారు. నాడు ఇదే మాట చెప్పి జత కట్టి, కుర్చీలెక్కారు.. మరి ఇప్పుడు మరలా ఎందుకు ఈ కూటమిని నమ్మాలో… బాబు & కో ఎవరైనా ప్రాంసరీ నోటుపై రాసిచ్చినంత బలంగా చెప్పగలగాలి!

ఏపీకి కావాల్సినన్ని సమస్యలను రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలోని పెద్దలు కలిగించారు. రాష్ట్ర విభజన అనంతరం తన సీనియారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు… ఆ సమస్యలను కంటిన్యూ చేస్తూ, మరికొన్ని సమస్యలు సృష్టించారు. మరి ఆ సమస్యలు ఇప్పుడు టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి చూపించే పరిష్కారాలు, ఇచ్చే హామీలు ఏమిటనేవి స్పష్టం చేయని పక్షంలో పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు!

ఉదాహరణకు… ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే చంద్రబాబు – మోడీ లు ప్రధానంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సింది… ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇచ్చే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్న టీడీపీ – మోడీ వైఖరి ఏమిటనేది స్పష్టం చేయాలి. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా ఆపుతారో లేదో చెప్పాలి.

జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి నాడు మోడీ సర్కార్ ఎందుకు తప్పుకుందీ.. ఎందుకు చంద్రబాబుకు ఇచ్చిందీ స్పష్టం చేయాలి. రాజధాని నిర్మాణానికి తగిన ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇవ్వాలి.. విశాఖ రైల్వే జోన్ అంశంపైనా స్పష్టత ఇవ్వాలి. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని గాలికి వాదిలేసిన బీజేపీ ప్రభుత్వం… ఇప్పుడు కొత్తగా ఏమి చేస్తాదో స్పష్టంగా చెప్పాలి. 2014లో చేసిన మోసాలు, ప్రజలకు పొడిచిన వెన్నుపోట్లు కాకుండా బాబు ఏమి చేస్తారో స్పష్టం చేయాలి అని ఏపీ ప్రజానికం గట్టిగా కోరుతుంది.