వైసీపీలోనే చాలామంది రెడ్డి సామాజిక వర్గ నేతలకు అర్థం కాని విషయం కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని ఎందుకు అంతలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు.? జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారు.? అని.!
నిజమే, వైసీపీలో చాలామంది నాయకులున్నారు. కానీ, కొడాలి నాని తరహాలో రాజకీయ ప్రత్యర్థులకు ధీటుగా సమాధానమివ్వగల నాయకుడు ఇంకొకరు లేరనే చెప్పాలి. పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు వున్నాగానీ, కొడాలి నానితో పోల్చితే తక్కువే.!
టీడీపీ అంటే ‘కమ్మ’ పార్టీ. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఒకప్పుడు కొడాలి నాని కూడా టీడీపీలోనే వుండేవారు. అయితే, అనూహ్యంగా ఆయన టీడీపీని కాదని, వైసీపీ వైపు వెళ్ళారు. అక్కడి నుంచి చంద్రబాబుని కొడాలి నాని ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారు.
టీడీపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, గుడివాడలో కొడాలి నానిని ఢీ కొట్టడం సాధ్యం కావడంలేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుడివాడలో కొంత అనుకూల పరిస్థితి వుండొచ్చన్న చర్చ అంతటా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కొడాలి నాని సీటు విషయమై అటూ ఇటూ ఆలోచిస్తున్నారు. ‘నాకు టిక్కెట్టు ఇచ్చినా, ఇవ్వకున్నా నేను జగన్ వెంటే వుంటా..’ అని కొడాలి నాని పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.
టీడీపీ నుంచి కొందరు కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు కొడాలి నానితో సంప్రదింపులు షురూ చేశారట. సామాజిక వర్గ కోణంలో బ్లాక్‌మెయిల్ కూడా గట్టిగానే జరుగుతోందిట. అయితే, కొడాలి నాని మాత్రం, సీటు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. గెలిచినా.. ఓడినా.. జగన్ వెంటే వుంటానని తెగేసి చెప్పారట.
ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అయ్యింది.