పవన్ విషయంలో… వర్మ జోస్యం నిజమైతే అది సరికొత్త రికార్డ్!

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది.. జూన్ 4 కోసం కోట్ల కళ్లు ఎదురుచూస్తున్నాయి. ఆ రోజు సైకిల్ వేగం పుంజుకుంటుందా.. లేక, ఫ్యానే మరోసారి గిరా గిరా తిరుగుతుందా అనేది తీవ్ర ఆసక్తిగా నెలకొంది. మరోపక్క కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారంటూ వైసీపీ నేతలు చెబుతుండటం ఆసక్తిగా మారింది. మంగళగిరిలోనూ మరోసారి ఫ్యానే అంటూ వైసీపీ శ్రేణులు చేస్తున్న వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపుతున్నాయి.

ఈ సమయంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ పరిస్థితి గురించి మాత్రం తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కన్ ఫాం అన్ని జనసైనికులు బల్లగుదీ మరీ చెబుతున్న పరిస్థితి. మరొపక్క… ప్రచారం చివరి రోజు వంగ గీతకు డిప్యూటీ సీఎం ప్రకటన అనంతరం లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయని… స్థానికత అంశం కూడా తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.

అయితే అలాంటివీ ఏమీ లేవు.. పిఠాపురంలో పవన్ కు లక్ష మెజారిటీ కన్ ఫాం అని అంటున్నారు ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ. తాజాగా ఒక టీవీ డిబేట్ లో మాట్లాడిన ఆయన… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఓట్లు పడ్డాయని తెలిపారు. పైగా… పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లక్ష ఓట్ల మెజారిటీ కన్ ఫాం అని అంటున్నారు.

ఈ క్రమంలో వర్మ చెబుతున్న లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా.. పిఠాపురంలో రెండు లక్షల నాలుగు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయని.. వాటిలో ఒక లక్ష 50 వేల ఓట్లు పవన్ కళ్యాణ్ కు వస్తాయని.. ఈ లెక్కన చూసుకుంటే మొత్తంగా లక్ష మెజారిటీతో పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో జనసైనికుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సంపాదించే నాయకులలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారని వర్మ చెబుతున్నారు. రాష్ట్రంలో టాప్ మెజారిటీ వచ్చేది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు మాత్రమేనని నొక్కి చెబుతున్నారు. ఈ సమయంలో మరో అడుగు ముందుకేసిన వర్మ… ఈసారి పవన్ కళ్యాణ్ కు వైఎస్ జగన్ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు.

ఆ సంగతి అలా ఉంటే… వర్మ చేసిన ఈ వ్యాఖ్యలను ముందుజాగ్రత్త చర్చలుగా అభివర్ణిస్తున్నారు వైసీపీ జనాలు. పిఠాపురంలో పవన్ పాతుకుపోతే తన, తన్న కుటుంబ రాజకీయాలకు శుభం కార్డు పడినట్లేనని వర్మ భావించారో లేదో తెలియదు కానీ.. ఆయన అనుచరులు భావించారని, ఆ సమయంలో విడుదలైన కొన్ని వీడియోలు అందుకు సాక్ష్యాలని.. ఈ నేపథ్యంలో రేపొద్దున్న ఫలితాలు కాస్త అటు ఇటుగా మారితే నేరం తనపై పడకుండా చేసిన వ్యాఖ్యలని అంటున్నారు.

దీంతో మరోసారి పిఠాపురం ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. నిజంగానే పవన్ కు లక్ష మెజారిటీ వస్తే వెల్ అండ్ గుడ్ కానీ… తేడా జరిగితే మాత్రం నేరం ఎవరిది అనాలి అంటూ జనసైనికులు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా… వర్మ చెప్పినట్లు ఏపీలో వైఎస్ జగన్ కంటే పవన్ కు ఎక్కువ మెజారిటీ వస్తే మాత్రం అది కచ్చితంగా ఆసక్తికర పరిణామమనే చెప్పాలి!