పిఠాపురం నియోజకవర్గం శాసనసభ స్థాయిలో పొలిటికల్ వాతావరణం వేడెక్కుతోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయంతో జనసేన శిబిరం ఉత్సాహంలో ఉన్నా, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ తాజాగా అందిస్తున్న సంకేతాలు రాజకీయంగా కొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. టీడీపీ తరఫున సీటు వదులుకున్న వర్మ, ఇప్పుడు “కార్యకర్తే అధినేత” అన్న నినాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి తన దూకుడు చూపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలో వర్మకి ప్రాధాన్యత తగ్గిందని కొందరి వాదన. కానీ వర్మ మాత్రం తాను పుట్టి పెరిగిన మట్టిలో తనకు దూరం అనే మాటే లేదని చెబుతున్నారు. అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలపై తన స్పందన, పర్యటనలు ఆయన పాత్రను మరోసారి ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇటీవల ఉప్పాడలో మత్స్యకారుల అభ్యున్నతికి హామీలు ఇవ్వడం, నియోజకవర్గంలోని సమస్యలపై కలియతిరుగుతూ ప్రజలతో మాట్లాడడం ద్వారా రాజకీయంగా తన బలం ఇంకా ఉందని చూపిస్తున్నారు.
ఇది సాధారణ ఉద్యమంలా కాకుండా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న చర్యగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా, హామీలు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉండగా, వర్మ మాత్రం తన స్థాయిలో నేరుగా వాటిని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ క్యాడర్‌లో వర్మ మళ్లీ ఉత్సాహం నింపేందుకు ఇది బలమైన టూల్‌గా మారుతుందని అంటున్నారు.
ఈ పరిణామాలతో జనసేన-టీడీపీ మధ్య పొత్తు పరస్పర గౌరవంతో ఉన్నా, లోలోపల రాజకీయ స్థితిగతులు వేడి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వర్మ జనంలోకి వెళ్లడం, తన ప్రభావాన్ని కొనసాగించడం ఒకవైపు, పవన్ కళ్యాణ్ అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించాల్సిన ఒత్తిడి మరోవైపు. ఎలాగైనా పిఠాపురం రాజకీయ సమీకరణాలు ఈ కొత్త కదలికలతో మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.