36 సంవత్సరాల క్రితం ఈరోజు ఎన్టీఆర్

09. 01-1983, సరిగ్గా 36 సంవత్సరాల క్రితం ఇదేరోజు నందమూరి తారక రామారావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు . 1982 మార్చి 29వ తేదీన తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ గా వెలుగుతున్న రామారావు రాజకీయరంగంలో కి వచ్చి పార్టీని ప్రారంభించారు .

అప్పటికే తెలుగు ప్రజలు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి వేసారి పోయారు . అందుకే అన్న రామన్న రాజకీయాల్లోకి వచ్చి కేవలం 9 నెలల కాలంలోనే తన చైతన్య రథంపై నిద్రాహారాలు కూడా మర్చిపోయి , ప్రజలతో మమేకమై , ఒక సామాన్యుడిలా వారి కష్ట సుఖాలు పంచుకుంటూ ఎన్నికల రణ క్షేత్రంలో యోధుడులా రాష్ట్రమంతా ప్రచారం చేశారు . ఎన్నికల్లో పోటీచేసి పార్టీని విజయ పధంలో నడిపించాడు . యావత్ దేశాన్ని ఆశ్ఛర్య పరిచి 204 శాసన సభా స్థానాలను గెలిపించారు . అది అన్నగారి ఆత్మవిశ్వాసం , ప్రజలపై పెట్టుకున్న నమ్మకం ,ప్రజా నాయకుడుగా అన్నగారికి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు .

జనవరి 7న శాసన సభ్యులంతా సమావేశమై రామారావును నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ విషయాన్ని పార్టీ గవర్నర్ కు తెలియజేసింది . ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండమని గవర్నర్ నుంచి వర్తమానం వచ్చింది . గతంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రాజభవన్ లో జరిగేది . ఆ సంప్రదాయానికి వీడ్కోలు చెప్పి ప్రజల సమక్షంలో ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు . రామారావు తనదైన ముద్ర వేయడం మొదలు పెట్టారు .

అందుకు తగ్గట్టే 9వ తేదీ న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరిగాయి . స్టేడియాన్ని అందంగా అలంకరించారు . తెలుగుదేశం దేశం శాసనసభ్యులు, నాయకులు , నగర ప్రముఖులు , సినిమా రంగ ప్రముఖులు , అభిమానులు , ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రమాణ స్వీకారం చూడటానికి తరలి వచ్చారు .ఆంధ్ర ప్రదేశ్ అన్ని చోట్ల నుంచి అన్నగారి అభిమానులు హైదరాబాద్ వచ్చేశారు . ఆహుతులతో స్టేడియం అంతా నిండిపోయి కళకళలాడిపోయింది .

ప్రజల కోసం ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ కనుక ప్రజల సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని అన్న ఎన్టీఆర్ ప్రకటించాడు . ముహూర్త సమయానికి గవర్నర్ అబ్రహం రామారావు తో ప్రమాణ స్వీకారం చేయించారు . అనంతరం ఎన్టీఆర్ జిందాబాద్ అనే నినాదాలు స్టేడియంలో ప్రతిధ్వనించాయి . రామారావు ముకుళిత హస్తాలతో ప్రజలు నమస్కరించారు .

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తరువాత అన్న తారక రాముడు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు . బడుగు బలహీన వర్గాలు , తాడిత , పీడిత ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని , ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడతానని, ఈ జీవితాన్ని తెలుగు ప్రజల సేవకే అంకితం చేస్తానని ప్రకటించాడు . జర్నలిస్టుగా అన్న తారక రామారావు నన్ను బాగా అభిమానించేవారు . ఆయనను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేశాను . ఆరోజు రామారావు గారి ఉపన్యాసం , ఆయన అభిమానులనే కాక ప్రజలను కూడా ఎంతో ఉత్తేజితులను చేసింది . అది నేను ప్రత్యక్షంగా చూశాను . జనవరి 9 1983 తెలుగువారి రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు . అదొక మర్చిపోలేని మధుర ఘట్టం . ఎన్టీఆర్ నిస్సందేహంగా కారణం జన్ముడు . .
-భగీరథ