స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణం.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నందమూరి కుటుంబంలో విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.

అనారోగ్యంతో ఉమామహేశ్వరి మరణించినట్లుగా తొలుత వార్తలొచ్చాయి. అయితే, తన తల్లి బలవన్మరణానికి పాల్పడినట్లు ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఫ్యానుకి ఉరివేసుకుని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

అయితే, బలవన్మరణానికి పాల్పడేంత కష్టం ఆమెకు ఏమొచ్చిందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. కొన్నాళ్ళ క్రితమే ఉమామహేశ్వరి కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో తోడళ్ళుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుసుకున్నారు. చాలాకాలంగా ఈ ఇద్దరి మధ్యా వున్న రాజకీయ వైరం కూడా చల్లారడానికి ఆ వేడుక వేదికైందని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఉమామహేశ్వరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. కుటుంబం పరంగా చూసుకున్నా, ఆమెకు పెద్దగా సమస్యలేమీ లేవు. అయితే, కొంతకాలంగా ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కారణంగానే ఆమె తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

అనారోగ్య సమస్యలు, తట్టుకోలేనంత మానసిక ఒత్తిడి నేపథ్యంలో ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడి వుండొచ్చన్నది కుటుంబ సభ్యుల అనుమానంగా కనిపిస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నారట.