ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన తాజా ప్రకటన బిజెపికి షాకిచ్చేదే అనటంలో సందేహం లేదు. మిగిలిన రాష్ట్రాల్లో, రాజ్యసభలో ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా బిజెపి తన బలం పెంచుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. ఫిరాయింపులకు వ్యతిరేకంగా నీతులు చెప్పిన రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా చివరకు ఫిరాయింపులను ప్రోత్సహించారు.
ఈ నేపధ్యంలోనే టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో కొందరిలో చీలిక తెచ్చి బిజెపిలో కలుపుకోవాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం ప్లాన్లు వేస్తోంది. అందుకు అనుగుణంగా కొందరు ఎంఎల్ఏలతో టచ్ లో కూడా ఉంది. అందుకనే టిడిపి ఎంఎల్ఏల్లో ఏ రోజు ఎవరు షాకిస్తారో తెలీక చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. దానికి తోడు మొన్ననే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబుకు మద్దతుగా ఇద్దరు, ముగ్గురు ఎంఎల్ఏల తప్ప ఇంకెవరూ నోరు విప్పలేదు.
టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయిస్తే తమపై అనర్హత వేటు పడుతుందన్న కారణంతోనే కొందరు టిడిపి ఎంఎల్ఏలు ఫిరాయించటానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే ఎంఎల్ఏల పదవులు పోతే మళ్ళీ గెలవలేమన్న భయం వాళ్ళని వెంటాడుతోంది. ఫిరాయించే ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడకుండా చూడాలన్నది బిజెపి ఆలోచన.
అయితే తాజాగా స్పీకర్ తమ్మినేని ఫిరాయింపులపై మాట్లాడుతూ ఫిరాయింపులకు పాల్పడిన ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటు వేస్తానని ప్రకటించారు. ఒకరకంగా హెచ్చరికలాంటిది కూడా అనుకోవచ్చు. దాంతో ఇటు బిజెపిలోను అటు ఫిరాయించాలని అనుకున్న కొందరు టిడిపి ఎంఎల్ఏలకు పెద్ద షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి. మరి స్పీకర్ తాజా ప్రకటన ఏపిలో రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.