సోంపేట విధ్వంసానికి పదిహేనేళ్ళు..

అదిగో బీల.. సోంపేట నడిబొడ్డున పచ్చని నేల.. ఇప్పుడైతే ప్రశాంతమే గాని.. అక్కడ ఎన్ని పోరాటాలు.. అణచివేతకు సర్కారు పనుపున ఎన్ని విధ్వంసాలు!

రాజుల నాటి మాట కాదిది.. తెల్లోడి ఏలుబడీ కాదు.. పంద్రా సాల్ పెహలే సాగిన హల్చలే.. ఎలా పడిందో సర్కారు కన్ను అక్కడ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం కట్టాలని ప్రతిపాదన.. వద్దని స్థానికుల వాదన.. చినికి చినికి గాలివాన.. బాలగోపాలుని రాకతో ఉధృతమై.. ఉప్పెనై.. తీవ్ర నిరసనై.. కురుక్షేత్రమై.. ఇదే సంది వేయి మంది క్షతగాత్రమై.. ముగ్గురు అమరులై..!!

ఇంతకీ ఏంటా కత.. ఎందుకంత కలత.. బీలపై ఏమంత మమత.. ఎలా రేగింది మంట.. ఎట్టా తీరింది సర్కారు కడుపు మంట..!

అది వలస పక్షులకు విహార సౌధం.. ఔషధ మొక్కల నిలయం.. అరుదైన ఒంటి కన్ను గబ్బిలాలకు ఆలవాలం.. జీవ వైవిధ్యానికి పేరెన్నిక గన్న సదనం.. అక్కడ కర్మాగారం కడితే పర్యావరణానికి ఎనలేని హాని.. స్థానికులకు ఎడతెగని గ్లాని.. ఉద్యమం నడుస్తున్నా ఆగని సర్కారు.. ఇదే రోజున విప్పింది పడగ నిరసన జ్వాలలే ఎగసిపడగా!

ఆనాటి ఆ విధ్వంసం అంతర్జాతీయ అంశమై.. అధ్యయనాలు జరిగితే.. దిగివచ్చిన సర్కారు.. శాంతించిన బీల.. కొత్త కళ పొదుగుకున్న ఆ నేల.. గెలిచిన సోంపేట జనాభా గలాభా.. అది పోరాటం కాదు నమ్ముకున్న నేలను కాపాడుకోవాలన్న ఓ జాతి ఆరాటం…!