కేజీ టూ పీజీ కోసం ప్రభుత్వం మెడలు వంచుతాం

విద్యార్థుల సమస్యల పరిష్కారానికై  ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్రలు చేపట్టారు. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రారంభమైన యాత్ర దేవరకొండ వరకు సాగనుంది. ఈ యాత్ర ఈ నెల 30న నల్లగొండలో ముగుస్తుంది. విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు తగ్గించాలని, హాస్టళ్లలో మౌళిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే సమస్యలు పరిష్కరింపజేసుకుంటామని వారు తెలిపారు.

కేజీ టూ పీజీ ఉచిత విద్య అని సీఎం కేసీఆర్ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని ఎస్ ఎఫ్ ఐ నాయకులు దుయ్యబట్టారు. చాలా కళాశాలల్లో అధ్యాపక , ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నాటకాలాడుతుందన్నారు. మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు వర్ణాణాతీతం అన్నారు. మట్టి గోడలలో చదువులు సాగుతున్నాయని ప్రగతి భవన్ కాదు ప్రగతిని పంచే విద్యాలయాలకు భవన్ లు కట్టించాలని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ మాయ మాటలతో రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ ఓ మాయల పకీర్ అని ఎద్దేవా చేశారు. టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యాలయాల్లో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతుందని ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదని వారు దుయ్యబట్టారు. జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన తిరిగి ప్రభుత్వం చేస్తున్న మోసాలను విద్యార్థులకు ప్రజలకు వివరిస్తామని ఎస్ ఎఫ్ ఐ నేతలు తెలిపారు.