మూడు పెళ్లిళ్ళ పై పవన్ క్లారిటీ, ఏమన్నాడంటే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల విషయంపై మరో సారి స్పందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల పవన్ పెళ్ళిలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పవన్ పెళ్లిల్ల అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పవన్ తను మూడు పెళ్లిల్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు. పవన్ తన పెళ్లి రహస్యాన్ని ఏమని చెప్పాడో అతని మాటల్లోనే…

“మీ అందరితో పోల్చుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది. మీ లాగా నా జీవితాన్ని దాయను. మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి లేకుంటే చీదరించుకుంటే చీదరించుకోండి. మీరేమనుకున్నా సరే నేను లోపల ఒక మనిషిని బయట ఒక మనిషిని కాదు. ఒక పెళ్లి చేసుకొని మీలాగా బలాదూర్ ల తిరిగేవాడిని కాదు. నా కర్మ, నాకు కుదరలేదు. ఇలా జరిగింది నేనేం చేయను. గతాన్ని మార్చలేను కదా…

మంచో చెడో జరిగింది. నాకేమి ఒళ్లు పొగరెక్కి పెళ్లిళ్లు చేసుకోలేదు. నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టమే. ఎందుకంటే నేనేప్పుడు బయటి వారి గురించే ఏడుస్తుంటాను. వీళ్లకేమైంది, వాళ్లకేమైంది. వారు ఎలా ఉంటున్నారో అని ఆలోచిస్తుంటాను. నేను రోజు ఏడుస్తుంటే పక్క వాళ్ళకు సుఖమేముంటది. అందరూ నన్ను సినిమా యాక్టర్ అనుకుంటారు. బాగా గొప్పగా ఉంటాను అనుకుంటారు. కానీ నేను ఓ చిన్న గదిలో ఓ మూల కూర్చొని పుస్తకాలు చదువుకుంటాను. నా జీవితంలో పార్టీలు లేవు, పబ్స్ లేవు. ఆవుల దగ్గరో, గేదేల దగ్గరో లేకపోతే ఎవరో ఒక వాళ్లతో మాట్లాడుతూ ఉంటాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ప్రకృతితో ఎక్కువ సేపు గడపటానికి ఇష్టపడతాను. వీడితో సుఖంగా బతకలేం అనుకున్నారు. నా పై ఎప్పుడూ ఒత్తిడి. నా వ్యక్తిగత జీవితం ఛిన్నాభిన్నమై పోయింది. నేను ఏడ్చాను, ఇబ్బంది పడ్డాను. ఇన్ని సమస్యలతో అలా పెళ్లిళ్ళు జరిగిపోయాయి. పెళ్లిళ్లు పొగరెక్కి చేసుకున్నానా… నా కర్మ కాలి అలా చేసుకోవాల్సి వచ్చింది” అని పవన్ తన పెళ్లిళ్ల రహస్యాన్ని తెలిపారు.