‘ఆస్కార్’ – ఆర్ఆర్ఆర్.. మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహం.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా వెనుక అన్నీ తానే అయి చిరంజీవి వ్యవహరించారా.? సినిమా వ్యవహారాల్లో కాదుగానీ, సినిమా రిలీజ్ సమయంలో సినిమా టిక్కెట్ల ధరల విషయమై జరిగిన రచ్చ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమ పెద్దగా చూపించిన చొరవ.. అంతా ఇంతా కాదు. ‘మీరు తెలుగు సినిమా పెద్ద.. మీరు ఆ పెద్దరికాన్ని వద్దన్నాసరే.. మిమ్మల్ని మేం పెద్దన్నలానే చూస్తాం..’ అని దర్శకుడు రాజమౌళి కూడా చెప్పాడు.

సరే, అది వేరే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కిన ప్రతి సందర్భంలోనూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వచ్చారు. తన కుమారుడు రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడని మాత్రమే కాదు.. అది మన తెలుగు సినిమా కాబట్టి.! ఔను, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రమోట్ చేసేందుకు చిరంజీవి శక్తివంచన లేకుండా కృషి చేశారన్నది జగమెరిగిన సత్యం. జేమ్స్ కేమరూన్ లాంటి లెజెండరీ హాలీవుడ్ ఫిలింమేకర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని అభినందించినప్పుడూ చిరంజీవి ఉప్పొంగిపోయారు.

ఓ సందర్భంలో పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయినప్పుడు.. చిరంజీవి దారుణమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. అవన్నీ మామూలే.! సినిమా రంగంలో చిరంజీవి చూడని సక్సెస్ లేదు. అదే సమయంలో ఆయనపై ట్రోలింగ్ అప్పటినుంచీ ఇప్పటిదాకా వివిధ రూపాల్లో జరుగుతూనే వుంది. ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ రాగానే, చిరంజీవి సంబరపడ్డారు. ఓ వీడియో విడుదల చేశారు. రాజమౌళి ఘనతను ప్రత్యేకంగా ప్రశంసించారు. మరోపక్క, ‘చిరంజీవి ప్రౌడ్ ఫాదర్’ అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఔను మరి, చిరంజీవి సాధించలేని ఆస్కార్‌ని చరణ్ సాధించుకొచ్చాడు మరి.!