వెండితెరపై ఆయన కనిపిస్తే మెరుపులే.. ఆయన నీడ కనిపించినా ప్రేక్షకుల విజిల్స్‌తో థియేటర్స్ మార్మోగిపోవాల్సిందే. ది గ్రేట్ తలైవా రజనీకాంత్ గురించే ఇదంతా. దశాబ్ధాల పాటు వెండి తెరపై మెరుపులు మెరిపించే ఆయన నిజజీవితంలో మాత్రం ఆ స్థాయి పంచ్ డైలాగ్‌లు వేయడం లేదు. తెరపై చూపించే దూకుడులో పావు వంతైనా చూపించడం లేదు. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నానంటూ పార్టీని ప్రకటించిన రజనీ ఆ తరవాత మాత్రం ఎందుకనో స్పీడ్ తగ్గించారు. రాజకీయ నాయకుడిగా కౌంటర్లు వేయడం లేదు.. సరికదా కనీసం సమస్యలపై కూడా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
పార్టీని ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చానని అనిపించుకున్న రజనీ ప్రజా సమస్యలపై మాత్రం ఆ స్థాయిలో స్పందించలేదు. కర్ర విరగదు.. పాము చావదు! అన్నట్టుగా సుతిమెత్తంగా మాట్లాడం మొదలుపెట్టారు. ఇది చూసిన వాళ్లంతా రజనీ రాజకీయాల్లోకి రాకుండా వుంటే మంచిదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విమర్శలూ గుప్పించారు. కమల్ దూకుడుగా వ్యవహరిస్తుంటే రజనీ మాత్రం డిప్లమాటిక్‌గా వ్యవహరించడం సామాన్య జనంతో పాటు ఆయన అభిమానులకు కూడా నచ్చడం లేదు. అయితే రజనీలో ఇటీవల ఊహించని మార్పు కనిపిస్తోంది.
తలైవా 2.0 రీబూటెడ్!
తనపై వస్తున్న విమర్శల్ని గమనించారో ఏమో తెలియదు కానీ తలైవా కూడా నెమ్మదిగా స్పందించడం మొదలుపెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ క్రమంలోనే తలైవా రజనీకాంత్‌లో ఇంత మార్పా? అని ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. ఇక రజనీలో ఈ మార్పునకు కారణం వేరొక హీరో కావడం ఇక్కడో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.
తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ఓ కీలక అంశంపై మాట్లాడి దేశవ్యాప్తంగా హాట్ డిబేట్ అయ్యారు. ఆయన జాతీయ విద్యా విధానంపై ఘాటు విమర్శలు చేయడం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై కొంత మంది రాజకీయ నేతలు సూర్యని విమర్శించారు. అయినా అతడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. అది గమనించిన రజనీ ఇంకా తను మౌనంగా వుంటే లాభం లేదనుకుని సూర్యకు మద్దతుగా ఇటీవల `కప్పాన్` ఈవెంట్లో వ్యాఖ్యానించడం తమిళ నాట ఆసక్తికరంగా మారింది. మీడియా ముందు ఎక్కువగా స్పందించడానికి ఇష్టపడని రజనీ సూర్య వివాదంపై అడగకుండానే స్పందించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రజనీకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది?. ఆయనలో వున్నట్టుండి ఈ మార్పు ఎలా వచ్చింది? రజనీలో మార్పుకు కారణం ఎవరై ఉంటారు? అంటూ సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది.