రాధ వర్సెస్ నాని: గుడివాడలో ఏం జరగబోతోంది.?

గుడివాడలో ఏం జరుగుతుంది.? 2024 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి.? సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న విషయం విదితమే. సుదీర్ఘకాలంగా ఆయన్ని నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తున్నారు. అయితే, ‘బూతుల మంత్రి’ అనే విమర్శల్ని మాత్రం ఆయన ఈసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి ఆయన తీరు ప్రధాన కారణం. ఆ కోణంలో నియోజకవర్గంలో కొంత నెగెటివిటీ వున్న మాట వాస్తవం. ఇక, కొడాలి నానితో తలపడేందుకు తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాకృష్ణని రంగంలోకి దించుతోందట. ఈ మేరకు వంగవీటి రాధా, గుడివాడకి మకాం మార్చబోతున్నారు కూడా. గుడివాడలో కాపు సామాజిక వర్గ నేతలతో ఇప్పటికే మంతనాలు జరిపిన వంగవీటి రాధ, రాజకీయంగా మంత్రి కొడాలి నానితో బాక్సింగ్ ఫైట్ చేస్తానంటున్నారట. నిన్న ఓ ప్రైవేటు కార్యక్రమంలో రాధ, నాని ముఖాముఖి ఎదురుపడ్డారు.

అయితే, అక్కడ కొడాలి నానికి మర్యాదపూర్వకంగా ‘షేక్ హ్యాండ్’ ఇచ్చేందుకూ రాధ సుముఖత వ్యక్తం చేయలేదట. కానీ, వ్యవహారం మీడియాలో మరోలా హైలైట్ అయ్యింది. కొడాలి నాని, రాధను వైసీపీలోకి ఆహ్వానించారనీ, అందుకు రాధ సమ్మతించారనేది మీడియాలో వినిపించిన కథనాల సారాంశం. ప్రస్తుతానికి రాధ టీడీపీలోనే వున్నట్లు కనిపిస్తోంది. అయితే, రాజకీయంగా వంగవీటి రాధ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. జనసేన పార్టీకి దగ్గరగా జరుగుతారు, టీడీపీ నేతలతో కలిసి తిరుగుతారు.. ఇప్పుడేమో ఇలా వైసీపీ నేత కొడాలి నానితో కలిసి కనిపించడం. అన్నట్టు, గతంలో వంగవీటి రాధ, వైసీపీలోనే వున్నారు. ఆయన వైసీపీలోనే వుండి వుంటే.. ఏమో, మంత్రి పదవి ఆయనకు దక్కి వుండేదేమో. ఇంతకీ, గుడివాడలో వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? వైసీపీని ఢీ కొట్టడం అయితే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకైనా కష్టమైన వ్యవహారమే అక్కడ.