క్వశ్చన్స్ ఫ్రం భీమవరం!

వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేయబోయే స్థానం అయితే ఫిక్స్ అయిపోయినట్లే! ఈసారి కూడా భీమవరం నుంచే పవన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని తెలుస్తుంది. గాజువాకలో కంటే భీమవరంలోనే కాస్త అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారో ఏమో కానీ… పవన్ మాత్రం అక్కడే ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. మరోపక్క పిఠాపురం టాపిక్ వచ్చినా.. నో ఛాన్స్ అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… తాజాగా భీమవరంలో టీడీపీ నేతలతోనూ, జనసేన కార్యకర్తలతోనూ విడివిడిగా భేటీ అయిన పవన్ కల్యాణ్.. భీమవరంలో తనకు సహకరించాలని టీడీపీ నేతలకు, డబ్బులు ఖర్చుపెట్టాలని జనసేన కార్యకర్తలకు చెప్పిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో భీమవరం ప్రజల తరుపున అన్నట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే… గత ఎన్నికల్లో పవన్ ని ఓడించిన గ్రంధి శ్రీను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇందులో భాగంగా… గత ఎన్నికల్లో భీమవరంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయారు. అయితే… ఓటమి అనంతరం ఈ ఐదేళ్లలో ఆయన భీమవరానికి కేవలం మూడుసార్లే వచ్చారు. అందులో ఒకసారి బహిరంగ సభకి, రెండోసారి వారాహి యాత్రకు, ఇక మూడోసారి ఇదిగో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వచ్చారు.. ఓడిపోతేనే ఇంత నిర్లక్ష్యం చేసిన వ్యక్తి, ఇక గెలిస్తే అసలు కంటికైనా కనిపిస్తారా? ఇది గ్రంధి వేసి సూటి ప్రశ్నగా చెప్పవచ్చు!

ఇక భీమవరంలోనే ఇల్లు తీసుకుంటాను.. ఇక్కడే ఉంటాను.. లోకల్‌ గా అందరికీ అందుబాటులో ఉంటాను అన్నట్టు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు అది ప్రాక్టికల్ గా ఏ మేరకు సాధ్యమో చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. షూటింగులు, హైదరాబాద్ లో ఫ్యామిలీ ఉండగా… హైదరాబాద్ ని కాదని భీమవరంలో నివాసం ఉండటం పవన్ కి సాధ్యమేనా? ఇళ్లు ఉండటానికి.. నివాసం ఉండటానికీ తేడా భీమవరం ప్రజలకు తెలియదని పవన్ భావిస్తున్నారా? అనేది మరో సూటి ప్రశ్న!!

ఇక పొత్తుల కోసం తాను ఎంత కష్టపడ్డానో, ఎన్నేసి అవమానాలు పడ్డానో, ఎన్ని తిట్లు తిన్నానో తనకు మాత్రమే తెలుసు అని చెబుతున్న పవన్… ఢిల్లీ – హైదరాబాద్‌ అంటూ తిరుగుతున్నదీ, పైరవీలూ చేస్తున్నది భీమవరం నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికేనా? అనేది మరో ప్రశ్న! ఇందులో కాస్త గోదావరి వెటకారం కలిసినప్పటికీ… అందులో చాలా పరమార్ధం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలోనూ రాజకీయాల్లో రిటైర్మెంట్‌ ఉండాలి, కొత్తవారికి అవకాశం ఇవ్వాల్ని అని కూడా పవన్‌ అంటున్నారు అన్న విషయాన్ని ప్రస్థావించిన శ్రీను… వయసులో పెద్ద అయిన చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే ఈ మాట అనడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క… రిటైర్మెంట్ ఉండాలని పవన్ చెబుతుండగా… ఇప్పటికే ఈ విషయాన్ని భువనేశ్వరి కన్ ఫాం చేసేశారు. చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని అనేశారు! దీంతో లోకేష్, పవన్, భువనేశ్వరి కలిసి ఏమైనా వేరేగా మాట్లాడుకుంటున్నారా..? అన్నది గ్రంధి శ్రీను సంధించిన మరో సూటి ప్రశ్న!

మరి సున్నితంగానూ, మర్యాదపూర్వకంగానూ, కాస్త వెటకారం కలిపి సంధించిన ఈ ప్రశ్నలకు పవన్ కానీ, జనసేన నేతలు కానీ ఎవరైనా సమాధానాలు చెప్పగలరా అనేది వైసీపీ అడుగుతున్న ప్రశ్న!!