పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పోలవరం ప్రాజెక్టు అథారిటి(పిపిఏ) జగన్మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ప్రాజెక్టు వ్యయం తగ్గించాలన్న లక్ష్యంతో జగన్ రివర్స్ టెండర్ విధానాన్ని అవలంభించాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే.
ఈ విషయమై తాజాగా సమావేశమైన పిపిఏ ఉన్నతాధికారులు రాష్ట్రప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం ఉండదని పిపిఏ ఛైర్మన్ జైన్ అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండరింగ్ వల్ల పనులు జాప్యం కావటమే కాకుండా ప్రాజెక్టు ధరలు కూడా పెరిగిపోతాయని ఛైర్మన్ ఆందోళన వ్యక్తం చేయటంలో వాస్తవం కూడా ఉంది.
గతంలో మధుకాన్ సంస్ధ నుండి ట్రాన్స్ ట్రాయ్ సంస్ధకు పనులు అప్పగించినపుడు కూడా సుమారు 3 నెలలు వృధాగా పోయిందని గుర్తు చేశారు. కాబట్టి రివర్స్ టెండర్ వల్ల పనుల్లో జాప్యం అవటం ఖాయమన్నారు. అదే సమయంలో ఇప్పటికన్నా తక్కువ ధరలకే ప్రాజెక్టు పనులు పూర్తి చేయటానికి సంస్ధలు ముందుకు వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదన్నారు.
ప్రాజెక్టు పూర్తి చేయటానికి అయ్యే గడువు పెరగటంతో పాటు నిర్మాణ వ్యయం పెరగటంపై కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని జైన్ స్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకానీ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి మాత్రం జైన్ ఏమీ మాట్లాడకపోవటం గమనార్హం. ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఆరోపించినా పిపిఏ మాత్రం ఆ విషయంలో ఏమీ మాట్లాడలేదు.