జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ పర్యటన సందర్భంగా నిర్వహిస్తున్న సభల్లో ఆయన చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో.. వైసీపీ నాయకులు, స్థానిక కాపు నేతలు పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మైకందుకున్నారు పోసాని.
పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసే విషయంలో ప్రముఖ నటుడు, ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్టైలే వేరని అంటుంటారు. ఇందులో భాగంగా… ముందు మెళ్లగా మొదలుపెట్టి, అనంతరం బలంగా వాతపెట్టి, లాస్ట్ లో చీమకన్నంత ఆయిట్మెంట్ రాసి ముగించారు పోసాని. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అవును… చిరంజీవి, ముద్రగడ లను ఆకాశానికెత్తుతూ… పవన్ ని పాతాళానికి తొక్కుతున్నట్లుగా పోసాని తాజాగా ఫైరయ్యారు. ఈ సందర్భంగా… పవన్ కల్యాణ్ కాపుల మధ్య నిలబడి కాపులను తిడుతున్నారంటే.. చంద్రబాబు ఎంత పెద్ద స్కెచ్ వేశారో అర్థం అవుతుందని మొదలుపెట్టిన పోసాని… తాను కాపు కాకపోయినా… ముద్రగడ లాంటి వారిని గౌరవిస్తానని ప్రకటించారు.
ఇదే సందర్భంగా… కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారని.. కాపులకు అన్యాయం జరుగుతుందని.. తన మంత్రి పదవికి సైతం ముద్రగడ రాజీనామా చేశారని గుర్తుచేసిన పోసాని… ముద్రగడ గొప్పవాడో, పవన్ కల్యాణ్ ప్రేమించే చంద్రబాబు గొప్పవాడో కాపు సోదరులు గ్రహించాలని సూచించారు. ఈ సందర్భంగా… ముద్రగడ ఒక్క అవినీతి చేశాడని నిరూపించినా.. తాను రాష్ట్రం విడిచి వెల్లిపోతానంటూ పోసాని సవాల్ చేయడం గమనార్హం.
చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పవన్ కల్యాణ్ అనుకోవడాన్ని తాను తప్పపట్టడం లేదు అని చెప్పిన పోసాని… వంగవీటి మోహన్ రంగా లాంటి వారిని చంపించిన చంద్రబాబుని అంత ఈజీగా మర్చిపోతారా..? అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో చిరంజీవి ఓడిపోవాలని కమ్మ కులస్తుల ఓట్లు ప్రజారాజ్యంకు వేయొద్దని చంద్రబాబు నాడు హుకుం జారీ చేశారని గుర్తుచేశారు పోసాని. అయినా కూడా “తాను ఓడినా పర్వాలేదు.. కానీ, చంద్రబాబుతో కలవను” అని చిరంజీవి అన్నారని, ఇది చిరంజీవి నిజాయితీ అని పోసాని ప్రశంసించారు.
పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నారో ఇప్పటికైనా కాపులు అర్థం చేసుకోవాలని సూచించిన పోసాని… జగన్, ముద్రగడ కంటే చంద్రబాబు ఉత్తముడని చంద్రబాబుకు పవన్ సపోర్ట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఇన్నీ వాయింపులు వాయించిన పోసాని… లాస్ట్ లో “పవన్ ఒకప్పుడు చాలా మంచి వాడే.. కానీ, ఇప్పుడు చంద్రబాబు మాయలో ఎందుకు పడ్డాడో అర్థం కావడంలేదు” అని చీమకన్నంత ఆయింట్మెంట్ రాశారు.