Posani Krishna Murali: పోసానికి కీలక పదవి ఇచ్చిన వైసీపీ సర్కారు.! ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా పోసాని.!

Posani Krishna Murali:సినీ పరిశ్రమకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది పరిశ్రమకు మేలు చేస్తుందా.? పరిశ్రమలోని తమ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే ‘మేలు’ చేస్తుందా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

ఇటీవలే వైసీపీ నేత, సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వైసీపీ సర్కారు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అంటే ఏం చేస్తారు.? ఆ సలహాదారు వల్ల ప్రభుత్వానికిగానీ, ప్రజలకుగానీ ఒరిగే ఉపయోగమేంటి.? అంటే, దానికి వైసీపీ వద్దనే సరైన సమాధానం లేదు.

ఇంతలోనే, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి, వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు 2019 ఎన్నికల్లో. అంతే కాదు, వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ మీద దూషణలకు దిగారు కూడా. ఇంతకన్నా క్వాలిఫికేషన్ ఏం కావాలి వైసీపీ ప్రభుత్వం నుంచి ‘పదవి’ పొదడానికి.?

ఇంతకీ, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి బాధ్యతలేంటి.? సినీ పరిశ్రమ తెలంగాణలో వుంది. హైద్రాబాద్ కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో పోసాని కృష్ణమురళి ఏం చేయబోతున్నారబ్బా.?

ఏమోగానీ, పార్టీని నమ్ముకున్నోళ్ళకు పదవులు.. వైసీపీకి మద్దతుగా నిలిచినవాళ్ళకి పదవులు.. అనే సంకేతాల్ని అయితే గట్టిగానే పంపుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరి, సినీ నటుడు మోహన్‌బాబు పరిస్థితేంటి.? ఆయన కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం గట్టిగానే చేశారు. రాజ్యసభ సీటుని ఆశించారు, టీటీడీ ఛైర్మన్‌గిరీ కూడా ఆశించారు. మరి, వైసీపీ నుంచి ఆయనకు తీపి కబురు ఎప్పుడు అందుతుందో.!