రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు అసలు కుట్రదారులు అరెస్ట్ కాలేదు. పదుల సంఖ్యలో దేవాలయాల, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. వీటిని అడ్డం పెట్టుకుని రాజకీయమైతే జోరుగా నడుస్తోంది కానీ నిందితులు మాత్రం స్వేచ్ఛగా బయటే ఉన్నారు. ఈ దాడుల వెనుక వ్యక్తిగత కోణం ఉందా లేకపోతే రాజకీయపరమైన కుట్రలు ఉన్నాయా అనేది తేలలేదు. సీబీఐ, రాష్ట్ర పోలీస్ శాఖ విచారణ జరుపుతున్నామని అంటున్నాయే కానీ ఫలితం కనిపించట్లేదు. భక్తుల్లో ఆలయాల మీద దాడులు జరిగాయనే బాధ కంటే చేసినవారు ఇంకా భేటీ ఉన్నారు అనే వేదన ఎక్కువైంది.
ఇలా దేవుళ్ళ విషయంలో నిందితుల వేట నత్తనడకన సాగుతుంటే అవతల పాలక వర్గం నేతల మీద దాడుల విషయంలో మాత్రం మెరుపు వేగంతో ఉన్నారు పోలీసులు. మొన్నామధ్యన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనకు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు రామాయాతీర్థం వెళుతున్నట్టు ప్రకటించిన తర్వాతే పర్యటన చేయాలని నిర్ణయించుకున్న విజయసాయిరెడ్డి హడావుడిగా రామతీర్థం వెళ్లారు. అప్పటికే అక్కడ టీడీపీ శ్రీనులు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నాయి. అదే సమయానికి విజయసాయి, వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో గొడవ జరిగింది.
తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఆ గొడవలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు విజయసాయి వాహనం మీద ఇటుకలు, వాటర్ బాటిళ్లు వేశారు. కారు అద్దాలు పగిలాయి. పాలక వర్గం నేతకు చెందిన కారు మీద అటాక్ అంటే హడావుడి మాములుగా ఉండదు కదా. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి అందుకు కారణం టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కళా వెంకటరావు అని అనుమానించారు. ఇంకేముంది.. బెటాలియన్ ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకెళ్లారు. మళ్ళీ కాసేపటికి రిలీజ్ చేశారు. కళా వెంకటరావుకు సౌమ్యుడనే పేరుంది. నోరు తెరిచి పరుషంగా మాట్లాడమే ఆయనకు చేయగాదు. అలాంటి వ్యక్తి భౌతిక దాడి చేయించారని అంటున్నారు.
సరే.. ఆయన దాడి చేయించారా చేయించలేదా అనేది పక్కపెడితే విజయసాయిరెడ్డి కారు అద్దాలు పగిలితే ఇంత హైటెంక్షన్ సీన్ నడిపిన పోలీసులు దేవాలయాల, దేవుళ్ళ విగ్రహాల మీద ఇన్ని దాడులు జరిగినా ఎందుకు నిందితులను పట్టుకోలేకపోయారు, ఆ తెగువ ఇక్కడ లేదెందుకని అంటున్నారు జనం.