( లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయంలో విజయవంతమయ్యారు. 2018/2019 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకమయినవని, ఇది గెలిస్తే మరొక తెలుగు బిడ్డ ఢిల్లీ లో చక్రం తిప్పుతాడని తెలుగుదేశం అభిమానుల్లో, టిడిపి కార్యకర్తల్లో ఒక నమ్మకం కుదిరించారు. అంతేకాదు, ఆంధ్రలో టిడిపి వస్తుందని, తెలంగాణలో టిడిపి బతుకుతుందని, ఒక ప్రధాన పార్టీ అవుతుందని కూడా నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన చాలా వ్యవూత్మకంగా ఉపయోగించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిడిపి పునరాగమనానికి సహాయం చేస్తుందని, దీనికి బదులుగా ఆంధ్రలో కాంగ్రెస్ ను బతికించేందుకు చంద్రబాబు సహాయం చేస్తాడని, ఇందులో తప్పేముందనేవాదన బలంగా టిడిపి కార్యకర్తులు వినిపిస్తున్నారు. జగన్ కంటే, మోదీకంటే, కె సియార్ కంటే ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మేలని ఏ టిడిపి నాయకున్న డిగినా బలంగా వాదిస్తున్నారు.
కాంగ్రెస్ తో పొత్తు చంద్రబాబును ప్రధానిని చేసినా ఆశ్చర్యం లేదని తెలంగాణ టిడిపి అభిమానులు, కార్యకర్తులు బలంగా నమ్ముతున్నారు. ఇదే వారు అత్యుత్సా ంగా పనిచేసేందుకు కారణం. చంద్రబాబు తమకు ఈ రహస్యం చెవిలో చెప్పినంత ఉత్సాహం వాళ్లలో కనిపిస్తుంది. నిజానికి తెలుగుదేశం లేదు, చచ్చిపోయిందని, తెలుగుదేశం మళ్లీ తలెత్తదని ముఖ్యమంత్రి కెసియార్ చాలాసార్లు ఆ పార్టీకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. టిఆర్ ఎస్ అభిమానులు, కెసియార్ అభిమానులు కూడా టిడిపిని పురుగు లాగా చూసే వారు. టిడిపి ఇంకెక్కడుంది అన్నారు. ఆంధ్రా పార్టీని తరిమేశామన్నారు. అయితే, 2018 ముందస్తు ఎన్నికలు అది తప్పని చెబుతున్నాయి. ఎంత కరువుకాటకాలొచ్చి భూమి ఎండిపోయి, నెర్రలిచ్చినా, వాన పడగానే, కప్పలు బెకబెకలాడుతు ప్రత్యక్ష మవుతాయి. అట్లాగా ఇపుడు తెలంగాణలో తెలుగు దేశం పుట్టుకొచ్చింది. వూరూర తెలుగు దేశం దండు తయారయింది. ఎన్నికల్లో తెలుగు దేశం సీట్ల కోసం పోటీ మొదలయింది. టికెట్ రాలేదని చాలా మంది అలుగుతున్నారు. కార్యకర్తల ఎన్నికల ర్యాలీలు ఎక్కడ చూసిన కనిపిస్తాయి. సోషల్ మీడియా లో తెలంగాణ తెలుగుదేశం అంటూ పిచ్చి పిచ్చిగా అభిమాన సంఘాలు తయారయ్యాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాలుగున్నరేళ్ల హైబర్నేషన్ లో ఉంది తప్ప అంతరించలేదని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నది. ఆ పార్టీ కి ఎక్కువ సీట్లు ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది తెలంగాణ జనసమితికి కాదు, తెలుగుదేశం పార్టీకి. ఇందులో చాలా అర్థముంది.
ఇలా తెలుగుదేశం పార్టీ జండా తెలంగాణ నేల మీద రెపరెపలాడటం టిఆర్ ఎస్ కు బాగా ఇబ్బంది గా ఉంది. ఎందుకంటే, కెసియార్ ఇచ్చిన డెత్ సర్టిపికేట్ బోగస్ అని తేలిపోయింది. తెలంగాణ కార్యకర్త, అటు అంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం కార్యకర్తల్లో ఈనూతనోత్సహా నికి కారణం ఏమిటి?
చంద్రబాబు ప్రధాని అవుతాడనేది ప్రధాన కారణం. ఈ మెసేజ్ ని బలంగా చంద్రబాబు పంపించగలిగారు.
రెండు రాష్ట్రాలలో టిడిపి వాళ్లు కచ్చితంగా నమ్ముతున్నవిషయం చంద్రబాబు 2019 లో ప్రధాని అభ్యర్థి అని. ఈ అభిప్రాయం కల్గించడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు. దీనికి కాంగ్రెస్ కూడా బాగా సహకరించింది. చంద్రబాబు తో పదే పదే చర్చలు జరపడం, రాహుల్ గాంధీ ఆయనను ప్రశంసించడం, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను దూతగా పంపి చర్చలు జరపడం… ఇలాంటివన్నీ సగటు టిడిపి కార్యకర్తను, ఆహా, ఓహోలలో పడేసింది.
ఇపుడు దేశంలో చాలా మంది బిజెపి వ్యతిరేక ముఖ్యమంత్రులున్నారు. చాలా మంది బిజెపి వ్యతిరేక జాతీయ నాయకులున్నారు. వాళ్లెవరూ బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంటు కట్టేందుకు, ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు ముందుకురావడంలేదు. ఎక్కువ మంది ఎంపిలను తీసుకువస్తే ప్రధాని పదవి మనదే అనే ఆశ వాళ్లలో ఉండవచ్చు. అయితే, ఫ్రంటు కూడగట్టడంలో ముందుకు ఉరుకుతున్నది చంద్రబాబు నాయుడే. దీనికి కాంగ్రెస్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని చెబుతారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక యువరాజకీయకుడు కావడం, దేశంలో సీనియర్ మోస్టు రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకరు కావడం, ఇపుడు పార్టీలన్నింటితో ఎన్డీయే రోజుల నుంచి చంద్రబాబుకు స్నేహ సంబంధాలుండటంతో కాంగ్రెస్ కూడా కాగలపనిని చంద్రబాబు కు అప్పగించింది. అందువల్ల రేపు ఏకారణం చేతనయినా ప్రాంతీయ పార్టీ నాయకుడి పేరు ప్రతిపాదిస్తే కాంగ్రెస్ చంద్రబాబు పేరు చెబుతుందని కూడా టిడిపి నేతలు విశ్వసిస్తున్నారు.
అందువల్ల తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక మౌఖిక క్యాంపెయిన్ మొదలయింది. ‘ఇది మన పార్టీకి కీలకయిన ఎన్నిక. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి. మన నాయకుడు చంద్రబాబు ప్రధాని అవుతాడు,’ అని మెసేజ్ వైరలయి టిడిపి గ్రూపులలో తిరుగుతూ ఉంది. చంద్రబాబు ప్రధాని కాకుండా ఆపలేరనే వీరావేశం కూడా టిడిపి కార్యకర్తల్లో కనిపిస్తుంది.
రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే, రెండు చోట్ల టిడిపి అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం ఉంది అనే బలమయిన విశ్వాసం కలిగించడంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి విజయవంతమయ్యారు. అదే తెలంగాణ టిడిపికి నూతనోత్సహం నింపి పరిగెత్తిస్తున్నది.మొన్నమొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ అనడానికే జంకినచోట్ల టిడిపి ర్యాలీలు నడుస్తున్నాయి.
తెలంగాణలో తెలుగుదేశం ఎన్నిసీట్లు గెల్చుకుంటుందో ఏమో, చంద్రబాబు ప్రధాని అవుతాడో లేదో… ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబును 2018 మళ్లీ జాతీయ వేదిక మీదక తీసుకెళ్లింది. అక్కడ ఆయన పదే పదే ప్రత్యక్షమవుతూ ఉండటం తెలుగుదేశానికి మంచి కిక్ మాత్రం ఇచ్చింది.
( ఈ వ్యాసంలో వ్యక్తం చేసి అభిప్రాయలన్నీ రచయిత వ్యక్తిగతం)