Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. సంక్రాంతి వేడుకలు కూడా ఇక్కడే జరుపుకోవడం పవన్‌కు పిఠాపురంపై ఉన్న ప్రేమను మరోసారి ప్రదర్శించింది. డిప్యూటీ సీఎం కావడంతో పిఠాపురం అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెరిగాయి. కానీ స్థానికంగా ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు మాత్రం పవన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
పిఠాపురం మునిసిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఈ విషయంపై హాట్ డిస్కషన్ నడిచింది. మునిసిపల్ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి ప్రణాళికలు చర్చించారు. అయితే కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బోసుబాబు అనే కౌన్సిలర్ ప్రత్యేకంగా పవన్ హాజరు గురించి ప్రశ్నిస్తూ, ఆయన వస్తే అభివృద్ధిపై చర్చలు సాగిస్తామని చెప్పారు.
ఇప్పటివరకు ఏడు నెలలు గడిచినా పవన్ మునిసిపల్ సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడంతో కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ప్రతీ కౌన్సిల్ సమావేశ వివరాలు పవన్‌కు చేరవేస్తున్నామని మునిసిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. కౌన్సిల్ సభ్యులంతా పవన్‌ను ఎదురుచూస్తున్నారని, ఆయన రాకపై ఆసక్తిగా ఉన్నారని అన్నారు.
పిఠాపురం అభివృద్ధి పట్ల పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నప్పటికీ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన ప్రత్యక్ష హాజరును కోరుతున్నారు. పవన్ త్వరలో పిఠాపురం కోసం సమయం కేటాయిస్తారో లేదో చూడాలి.