ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కొంతమేర వాహనదారులకు ఉపశమనమే. నిజానికి, వాహనదారులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ ఇది ఉపశమనం. కానీ, నిజమైన ఉపశమనమా.? కాదా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
పెట్రోలు మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిక బంతి రాష్ట్రాల కోర్టుల్లోకి వెళ్ళింది. అంటే, రాష్ట్రాలు కూడా పెట్రో ధరలపై భారాన్ని తగ్గించాలన్నమాట. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తగ్గింపు ప్రకటించాయి.
కానీ, వాస్తవమేంటి.? పెట్రోలు ధరలు దిగివచ్చిన మాట వాస్తవం. కానీ, 100 రూపాయల కిందికి రాలేదింకా. 100 రూపాయల పైనే పలుకుతోంది ధర. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలు 50 నుంచి 60 రూపాయల మధ్యలోనే వుండాలి. కానీ, అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అడ్డగోలుగా ప్రజల జేబులకు పన్నుల పేరుతో చిల్లలు వేసేస్తున్నాయ్.
కరోనా నేపథ్యంలో పెట్రో పన్నులు కేంద్రానికి వరంగా మారాయి. అందినకాడికి కేంద్రం దోచేసింది సామాన్యుడ్ని ఈ పన్నుల పేరుతో. ఇప్పుడేమో, వాత పెట్టి వెన్న రాసిన చందాన.. నామ మాత్రపు తగ్గింపుతో మమ అనిపించేయడమే కాదు, రాష్ట్రాల మీదకి పాపాన్ని నెట్టేసినట్లయ్యింది.
తగ్గించాల్సింది ఐదో, పదో కాదు.. పాతిక, ముప్ఫయ్.. ఆ పైన. అంత తగ్గించేస్తే, పాలకుల చిత్తశుద్ధి గురించి చర్చ ఎందుకు జరుగుతుంది.? పరిపాలన అంటే వ్యాపారం కాదంటూ ప్రభుత్వ ఆస్తుల అమ్మకం గురించి కేంద్రం గొప్పగా చెబుతోంది. మరి ఇదేంటి.? ప్రభుత్వమంటే, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడమా.?