ఏపీలో ఫ్రీ బస్ పథకం… పేర్ని నాని ‘సర్కస్ సర్కార్’ అన్నది అందుకేనా?

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలుపై తీవ్ర చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్ అందింది కానీ… మిగిలిన విషయాలపై మాత్రం సరైన క్లారిటీ రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా… సూపర్ సిక్స్ లో అసలు సిసలు హామీలు, మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్న పథకాలు చాలానే ఉన్నాయి.

ఇందులో భాగంగా… 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళకు రూ.1500, ప్రతీ ఇంటికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా ప్రతినెలా రూ.3000 నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలుకావాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటి వారం కావొస్తోంది. అయితే… ఈ హామీలపై మాత్రం కూటమి ప్రభుత్వం నోరు మెదుపుతున్నట్లు లేదు.

ఇటీవల తల్లికి వందనం అనే పథకానికి సంబందించి జీవో విడుదల చేసిన ప్రభుత్వం… అందులో స్పష్టత లేదంటూ తీవ్ర విమర్శలు రావడంతో, మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. దానిపై ఇప్పటివరకూ కదలిక లేదు! తాజాగా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లోనూ… అప్పులు చేయడానికి ఆమోదం తెలుపుకున్నారు తప్ప, ఈ హామీలపై చర్చలు జరిగినట్లు లేదు!

ఈ సమయంలో అనూహ్యంగా… మంగళవారం కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా… ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొదలు కాబోతుందంటూ ఎక్స్ లో సత్యప్రసాద్ పోస్ట్ పెట్టారు. దీంతో వెంటనే వెబ్ మీడియా ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టేసింది.

ఈలోపు ఊహించని విధంగా ఆ ఫ్రీ బస్ పోస్ట్ ను డిలీట్ చేశారు సత్యప్రసాద్. దీంతో… ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి సత్యప్రసాద్… రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి. రవాణాశాఖతో ఈయనకు ఎలాంటి సంబంధం లేదనే చెప్పాలి. ఇంతలో ఏమి జరిగిందో ఏమో కానీ… ఆయన ఆ పోస్ట్ డిలీట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి పేర్ని నాని స్పందిస్తూ…. ఇది సర్కస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా… తల్లికి వందనం జీవో, మార్గదర్శకాలపై ప్రభుత్వం ముందడుగు, వెనకడుగు వేసిందంటూ ఎద్దేవా చేశారు. ఇక తాజాగా ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అంటూ మంత్రి పోస్ట్ పెట్టి డిలీట్ చేయడంతో… సర్కర్ సర్కార్ అని పేర్ని నాని అన్నది అందుకే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!