ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని స్కూల్‌లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది స్పందించి అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. మార్క్ పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు చెప్పినట్టు సమాచారం.
పవన్ కల్యాణ్ ఈ సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. తన కుమారుడి గాయాల విషయాన్ని తెలుసుకున్నప్పటికీ, ఆయన పర్యటనను వెంటనే నిలిపివేయలేదు. అరకు సమీపంలోని కురిడి గ్రామానికి వెళ్లి గిరిజనులతో భేటీ కావాలని ముందుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజల సమస్యలు వింటానని చెప్పిన పవన్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తన కుమారుడి ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ, ప్రజల మధ్య ఉన్న బాధ్యతను మరచిపోకుండా పర్యటన కొనసాగించిన పవన్ కల్యాణ్ పై పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇదే నాయకత్వ లక్షణం” అంటూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ పర్యటన పూర్తయిన వెంటనే విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి సింగపూర్‌కు బయలుదేరే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మార్క్ శంకర్ ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. వైద్యులు ఎలాంటి రిస్క్ లేకుండా అతడి ఆరోగ్యం పర్యవేక్షణలో ఉందని తెలిపారు. అయితే పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. పవన్ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు మార్క్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఘటన మరోసారి పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని, ప్రజలపై ఉన్న బాధ్యతను చూపించిందని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.