సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్షణం ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పైగా అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకూ దాదాపు పూర్తయిన నేపథ్యంలో.. రెబల్స్ అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకంగా మారిన పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు పవన్ కల్యాణ్, వంగ గీత.. ఇద్దరి పరిస్థితీ దాదాపు ఒకేలా ఉందని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో రెబల్స్ గా మారకుండా కట్టప్పలుగా మిగిలిపోతారనే అనుమానం అసంతృప్తులపై పుష్కలంగా ఉంది. ఈ విషయంలో చాలా మంది అధినేతల మాటలతో కాం అయినట్లు కనిపిస్తున్నా.. రెబల్స్ గా మారకుండా ఉన్నా.. తెరవెనుక కట్టప్పలుగా మారతారనే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… జనసేన నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పాటు.. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీత కు కూడా ఈ విషయంలో సమస్య ఒకేలా ఉంది!
ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఏపీలో ఏ స్థాయిలో హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. అనూహ్యంగా చివరి నిమిషంలో తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో.. అక్కడ టీడీపీ కార్యకర్తలు, ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ అనుచరులు ఏ స్థాయిలో నిప్పులు కక్కారనేది తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు పిలుపుతో వర్మ & కో బుజ్జగించబడ్డారని అంటారు. దీంతో… పవన్ గెలుపుకు కృషి చేస్తానని వర్మ ప్రకటించినా.. వెనుక మాటలు వెనుక నుంచి వినిపిస్తూనే ఉన్న పరిస్థితి!
దీంతో… పోలింగ్ సమయానికి పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు.. కట్టప్పగా మారే ప్రమాదం ఉందా అనే ఆందోళన జనసైనికుల్లో బలంగా ఉందని చెబుతున్నారు! అదే జరిగితే పిఠాపురంలోనూ పవన్ కు దెబ్బ తప్పదనేది కామెంట్!
ఇక వంగ గీత విషయానికొస్తే… ఆమెకు కూడా అలాంటి సమస్యే ఉందని అంటున్నారు. ప్రధానంగా… సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని పక్కనపెట్టిన జగన్.. కాకినాడ ఎంపీగా ఉన్న గీతను పిఠాపురం అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో పెండెం దొరబాబు అలిగారనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో దొరబాబుని తాడేపల్లి పిలిపించుకున్న జగన్… బుజ్జగించి, భవిష్యత్తుకు భరోసా ఇచ్చి పంపించారని తెలుస్తుంది.
అయితే… ఆయన గీతకు సహకరిస్తారా.. లేక, చివరి నిమిషంలో కట్టప్పగా మారతారా అనేది ఇప్పుడు అతి పెద్ద సందేహం. అదే జరిగితే… పవన్ కు అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదనే చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే… పిఠాపురంలో అటు పవన్ కు ఇటు గీత కు దాదాపు ఒకటే రకం ఆందోళన ఉందని కాకపోతే ప్రభావం కాస్త అటు ఇటుగా ఉండొచని అంటున్నారు.