Adavi Thalli Bata: అడవి తల్లి బాటతో పవన్ ఇమేజ్‌కు కొత్త రెక్కలు

ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన “అడవి తల్లి బాట” పథకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైంది. ఇప్పటికీ డోలీలపై ఆసుపత్రికి వెళ్లే గిరిజనుల దుస్థితిని పరిగణలోకి తీసుకొని, వారికోసం ప్రత్యేక రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం పవన్ నాయకత్వంలో కొత్త అధ్యాయంగా మారింది. ఇవి కేవలం మానవీయ కోణంలోనే కాక, రాజకీయంగా కూడా పవన్ స్టెప్‌ను భిన్నంగా నిలబెట్టేలా ఉన్నాయి. ఇది సాధారణ నేతలతో పోల్చితే ఆయన్ను చాలా ప్రత్యేకంగా నిలబెడుతోంది.

ఇటీవలి ఎన్నికల్లో జనసేన మంచి విజయాన్ని అందుకున్నా, రాష్ట్ర పరిపాలనలో ఆ పార్టీ పాత్ర కొంతమంది నేతలకు, ప్రజలకు సందేహంగా కనిపించింది. కానీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ చేపట్టిన ఈ గిరిజన బాట అభియానం, పాలనలోనూ ఆయన దృఢంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేస్తోంది. ప్రజల్లో మంచి నాయకుడిగా మారాలంటే కేవలం మాటలకే కాదు, పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో పవన్ చేస్తున్న పని నిజంగా గమనించదగ్గది.

గతంలో జనసేనపై ఎక్కువగా వచ్చిన విమర్శలు ‘సినీ హీరో నాయకుడు కావడం వల్ల మేనేజ్‌మెంట్‌లో లోపం ఉంటుంది’ అనే మాటలే. కానీ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కోసం ప్రత్యేక ప్రణాళికలు, పరిశీలనలతో కాలి బాటన పర్యటనలు చేయడం ద్వారా ఆయన పాలనలో కొత్త పంథాను పరిచయం చేస్తున్నారు. ఈ పనులు అనుకున్న ప్రకారం కొనసాగితే పవన్ ఒక అధికారం పంచుకునే నాయకుడిగా కాకుండా, పూర్తి స్థాయి ప్రజానాయకుడిగా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రజల సమస్యలపై తక్షణ స్పందన చూపే నాయకులకు ఎంత ఆదరణ ఉంటుందో మనం ఇప్పటికే దేశవ్యాప్తంగా చూస్తున్నాం. అదే మార్గంలో పవన్ కూడా పయనిస్తున్నారని చెప్పవచ్చు. ఈ పనులు సక్రమంగా కొనసాగితే, తన ప్రభావాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించుకోగలగడం ఖాయం. తద్వారా వచ్చే ఎన్నికల్లో పవన్ మరింత పవర్‌ఫుల్ లీడర్‌గా మారడం అనివార్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనాల సమస్యలు పరిష్కరించడంలో సంకల్పంతో ముందుకెళ్తున్న పవన్.. నిజమైన పాలకుడిగా మారే దిశలో ధృఢమైన అడుగులు వేస్తున్నారని చెప్పాలి.

ఏపీలో ఏరులై పారుతున్న మద్యం || Huge Liquor Shops in AP || AP Liquor Policy || Chandrababu || TR