జనసేనాని పవన్ కల్యాణ్ కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం అవటం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చలకు దారితీస్తుంది. శుక్రవారం మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్యతో పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. కాపు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధుల వినియోగంతో పాటు.. కాపు సామాజికవర్గానికి ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించినట్లు సమాచారం. గతంలో హరిరామజోగయ్య, ఆయన కుమారుడు సూర్యప్రకాశ్ జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ జనసేనలో చేరలేదు. అయితే ఇప్పుడు హరిరామజోగయ్యతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పవన్ మీడియాతో మాట్లాడుతూ… తాను ప్రత్యేకించి ఒక కులానికి ప్రతినిధిని కాదని స్పష్టం చేశారు. తాను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు తనకు సమానమేనని అన్నారు. తనను ఓ కులానికి కట్టేయాలని చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తానని, అన్ని కులాల సమస్యలపై పోరాడే వ్యక్తిని తానని వివరించారు. ‘నాకు నా కులం ఎక్కువ కాదు, మిగతా కులాలు తక్కువ కాదు’ అని తెలిపారు. ఆయా కులాలను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసే చర్యల్లో భాగంగానే కార్పొరేషన్ల ఏర్పాటు అని విమర్శించారు. ఓ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇక ఆ కులం వారందరూ ఆ కార్పొరేషన్ పరిధిలోనే కొట్టుకుంటుంటారని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే ఓ కులం వారికి రాజకీయ సాధికారతను దూరం చేసే పన్నాగమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయ ఉపాధి కల్పించడం తప్ప మరే విధంగానూ కార్పొరేషన్లు ఉపయుక్తంకాదని వివరించారు.