విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి హామీలు ఇచ్చాయో గుర్తున్నాయి కదా! ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు. అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆయన ఎక్కిన ప్రతి వేదిక మీదా ఇదే స్టేట్‌మెంట్ ఇచ్చుకుంటూ పోయారు.
ఆ తరువాత రైతుల రుణాలను లక్షన్నరకు పరిమితం చేశారు. డ్వాక్రా మహిళల రుణాలను 10 వేల రూపాయలకు కుదించి పారేశారు. అదేమని అడిగితే- `పూర్తిగా మాఫీ చేస్తానని నేనేప్పుడు చెప్పాను?..` అంటూ క్వశ్చన్ మార్క్ మొహం పెడతారు చంద్రబాబు.
అదలావుంచితే- ఆయన ఇచ్చిన హామీలు, భరోసాల్లో మనం మరిచిపోయినది ఒకటుంది. `అధికారంలోకి వస్తే చెట్టు కింద కూర్చుని పాలిస్తా..`నంటూ బీరాలు పలకడం. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డంగా గొడ్డలితో నరికేసిందని, ఆర్థిక వనరులన్నింటినీ తెలంగాణకు ఇచ్చి, మనకు అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబు..తాను అధికారంలోకి వస్తే, ఏపీలో చెట్టు కింద కూర్చుని అయినా పరిపాలన చేస్తాననే భరోసా ఇచ్చారు జనానికి.
ఆ పని ఆయన చేసి చూపించారా? అంటే లేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమమే ఓ మహోత్సవంలా చేశారు. ఈ ఒక్క కార్యక్రమానికే 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. హైదరాబాద్‌లో ఏపీ వాటాగా వచ్చిన సచివాలయంలోని `ఎల్ బ్లాక్`ను రూ.50 కోట్ల రూపాయలతో పునరుద్ధరించారు. ఆనక- ఏపీకి తరలి వచ్చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణానది కరకట్టకు ఆనుకుని ఉన్న లింగమనేని హౌస్‌ను ఇంటిగా మార్చుకున్నారు. విశేషమేమిటంటే- ఇది అక్రమ కట్టడం, కూల్చేయండంటూ ఏపీ ప్రభుత్వమే నోటీసులను జారీ చేసింది. లింగమనేని హౌస్‌ను తన ఇంటిగా సౌకర్యంగా మార్చుకోవడానికి అక్కడా ఓ 50 కోట్లను ఖర్చు చేశారని ఎవర్ని అడిగినా చెబుతారు.
తాను చెట్టు కింద కూర్చుని అయినా పాలిస్తానంటూ చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన మాట, ఇచ్చిన భరోసాను బహుశా జనం మరిచిపోయి ఉండవచ్చు. చంద్రబాబు పార్ట్‌నర్‌గా పేరు సాధించిన పవన్ కల్యాణ్ ఆ మాటను గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పిన మాటను అటూ ఇటుగా కాస్త మార్చారే గానీ అర్థం మాత్రం అదే. తాను టెంటు కింద కూర్చుని అయినా రాజకీయాలు చేస్తానంటూ సెలవిచ్చారు పవన్ కల్యాణ్.
`రాజకీయాలు చేయాలంటే సంకల్ప బలం ఉండాలి, నేను టెంటు కింద కూడా రాజకీయాలు చేయగలను, నాకు మొన్నటిదాకా పార్టీ ఆఫీసులు కూడా లేవు, కానీ నాకు బలమైన సంకల్పం ఉంది ..` అని పిడికిలి బిగించి మరీ వల్లె వేశారు. టెంటు కింద కూర్చుని అయినా రాజకీయాలు చేస్తానన్న పవన్ కల్యాణ్.. పార్టీ కార్యాలయం కోసం రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగంతస్తుల భారీ బిల్డింగ్‌ను నిర్మించారు. ఆ భారీ భవనం ఖర్చు ఎంతో మన ఊహకే వదిలేసుకోవచ్చు.