తెలంగాణ ఉద్యమానికి పవన్ చెప్పిన మూల కారణం ఇది!

ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. వారి నుంచి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం.. అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా… తెలంగాణ ఏర్పడటానికి గల కారణాలను తనదైన కోణంలో తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్.

తాజాగా మీడియాతో మాట్లాడిన పవన్… “అసలు తెలంగాణ విభజనకు మూల కారణమే ఆంధ్రాలో అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, అక్కడ ఎంతో చక్కగా రైతాంగం ఉంటుంది, చక్కటి పంటపొలాలుంటాయి, విపరీతమైన ధాన్యం దిగుబడి ఉంటుంది… కానీ మాకు లేవు” అని తెలంగాణ రైతులు ప్రజలు భావించారని చెప్పే ప్రయత్నం చేసారు పవన్. దీంతో… కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉధ్యమం రావడానికి మూల కారణం… తెలంగాణ ప్రజలకు గోదావరి జిల్లాల్లో ఉన్న పచ్చటిపొలాలపై అక్కసు అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజానికం. అన్ని విషయాల్లోనూ… ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, సమిష్టిగా రావాల్సిన నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.. ఫలితంగా అవిరామంగా పోరాడారు.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు.

కారణం… తెలంగాణలో ప్రజలు తమ అభివృద్ధిని కాంక్షించారు, తమ వెనుకుబాటు తనానికి ఆంధ్రాపాలకులు మూల కారణం అని బలంగా నమ్మారు. అంతేకానీ… ఏపీలో, మరిముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పంటలు బాగా పండేస్తున్నాయని, అధిక దిగుబడులు వచ్చేస్తున్నాయనే అక్కసుతో కాదని పవన్ దృష్టికి తెస్తున్నారు. ఇకపై మాట్లాడేటప్పుడు… తెలంగాణ ప్రజల క్యారెక్టర్ ని తక్కువ చేసేదిగా, అక్కసున్న మనుషులుగా చూడొద్దని సూచిస్తున్నారు.

అనంతరం.. నాడు తెలంగాణ ఉద్యమనికి మూల కారణమైన గోదావరి పంటపొలాలు నేడు ఎండుపోయాయని, రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కవైపు అనావృష్టి, అతివృష్టి ఈ పరిస్థితుల మధ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. “పంటలు బాగా పండి, ధాన్యం బాగా దిగుబడి అయిన అనంతరం అకాల వర్షాలు వచ్చి పంట దెబ్బ తిన్నాయి” అనేది పాయింట్. దీంతో బాగా పండిన పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలపై.. అకాల వర్షాలు నీళ్లు చల్లాయి. ఫలితంగా వారికి జరిగిన నష్టాన్ని, కలిగిన కష్టాన్ని చూడటానికి పవన్ వెళ్లారు. కానీ… నేడు “గోదావరి జిల్లాల్లో పంటపొలాలు ఎండిపోయాయి” అని చెబుతున్నారు!