రాజకీయాల్లో త్యాగాలు కాదు వ్యూహాలు కావాలని అంటారు. అయితే ఆ రెండూ పవన్ నిత్యం చెప్పేవే. నాయకులు, కార్యకర్తలు త్యాగాలు చేయాలని.. వ్యూహాలు మాత్రం తనకు వదిలేయాలని అంటుంటారు. అయితే మాటలకూ చేతలకూ ఉన్న తేడా పవన్ కి ఈ వయసొచ్చినా తెలియడం లేదనే కామెంట్లు తాజాగా తెరపైకి వచ్చాయి. త్యాగాలు మాత్రం చేతల్లో చేస్తూ.. వ్యూహాలు మాత్రం మాటలకే పరిమితమవుతున్నాయనే విషయం పవన్ కి అర్ధం కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు చెబుతున్నట్లు బాబు వ్యూహాలు తెలిస్తే పవన్ ఒక్క నిమిషం కూడా పొత్తులో ఉండరని చెబుతున్నారు.
పొత్తులో భాగంగా 21 సీట్లకు పరిమితమైంది జనసేన. పైగా జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని.. అటు నుంచి ఎలాంటి మద్దతూ దొరకడం లేదని అంటున్నారు. అసలు పిఠాపురంలో అధినేత పరిస్థితే అలా ఉంటే… ఇక మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ సమయంలో అసలు పిఠాపురంలో పవన్ కు ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏమిటి… పవన్ కు పెనుసవాలుగా ఉన్న సమస్యలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!
ఎన్నికల నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది అనగా పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పవన్ చేసిన అతిపెద్ద మిస్టేక్స్ లో ఒకటి అని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ కేస్ట్ ఫ్యాక్టర్ కంటే ఎక్కువగా లోకల్ ఫ్యాక్టర్ పనిచేస్తుందనే విషయం ఆయన మరిచిపోయారు. వ్యూహాలు తనకి వదిలేయండి అంటూనే.. కనీసం ఈ బేసిక్ వ్యూహం కూడా వేయలేకపోయారు. కనీసం నాలుగైదు నెలల ముందు పిఠాపురంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఉంటే… వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండి ఉండేది కాదనే చెప్పాలి.
ఇక అక్కడ 90వేల కాపు ఓట్లు ఉన్నాయి.. అవన్నీ గంప గుత్తగా తనకే పడిపోతాయి అని పవన్ భ్రమిస్తున్నారనే విమర్శా ఉంది. అక్కడున్న వంగ గీత ఉన్నారు. పైగా… ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ కంటే పవన్ గొప్ప కాపునాయకుడు ఎంతమాత్రం కాదనేది తెలిసిన విషయమే. పైగా… అక్కడ 12శాతం మాలలు, 10 శెట్టిబలిజలతో పాటు రెడ్డి, యాదవ, మాదిగ మొదలైన సామాజికవర్గాల ప్రజానికం ఉన్నారు. అంటే… ఇక్కడ గెలవాలంటే అన్ని సామాజికవర్గాల మద్దతూ అవసరం.
ఇదే సమయంలో… ఇక్కడ కాపులు పోటీచేస్తే గెలిచేస్తారనే కేవలం భ్రమ మాత్రమే. ఒకప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ మూడోస్థానికి పరిమితమైన పరిస్థితి ఉంటే… క్షత్రియ సామాజీవర్గానికి చెందిన ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఇండిపెండెంట్ గా బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఆయన బలం అదే. పిఠాపురంలో వర్మ సామాజికవర్గం పెద్దగా లేకపోయినా… ఆయనకు అన్ని సామాజికవర్గాల్లోనూ మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి.
అయితే సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్లు, ఆడియో ఫంక్షన్ లో లాస్ట్ లో హీరో మైకందుకున్నట్లు.. పవన్ కల్యాణ్ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ కు రెండు రోజుల ముందు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు! దీంతో సహజంగానే టీడీపీ కేడర్ నుంచి రావాల్సిన స్థాయిలో అన్నట్లుగా వ్యతిరేకత వచ్చింది. పైగా ఇప్పుడు వర్మ వెనక్కి తగ్గే పరిస్థితి ఉండకపోవచ్చు. 2014 తరహా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకంజ వేయకపోవచ్చు. అదే జరిగితే పవన్ కు 2019 రిపీట్ అయ్యే ప్రమాదం పుష్కలంగా ఉందనే చెప్పాలి!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… జనసేన నేతలు, ప్రధానంగా పవన్ కల్యాణ్ పోటీ చేసే చోట రెబల్స్ ని రెచ్చగొట్టి ఓడించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని… అది వ్యూహాలు రచించే పవన్ కి అర్ధమయ్యేనాటికి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయని… చంద్రబాబు గేం స్టార్ట్ అని వైసీపీ నేతలు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో… ఇవి జనసైనికుల్లో మరింత ఆందోళన కలిగించే అంశంగా ఉంది! ఏది ఏమైనా… పిఠాపురం విషయంలో పవన్ చారిత్రక తప్పిదం చేశారా.. లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూస్తే సరిపోతుంది!