రాజకీయ నాయకుడికి ఎప్పుడూ స్పష్టత అవసరం. తాను చెప్పే మాటలోనూ, చేసే పనిలోనూ, ఇచ్చే హామీలోనూ, వేసే ప్రతి అడుగులోనూ స్పష్టత చాలా ముఖ్యం. ఆ స్పష్టతే ప్రజలు నిత్యం గమనిస్తుంటారు. కన్ ఫ్యూజన్ లేని పాలిటిక్స్ ని వారి నుంచి కోరుకుంటారు. అయితే… కేడర్ ను కన్యూజన్ లో పెట్టడంలోనూ, అస్పష్టతతో కూడిన హామీలు ఇవ్వడంలోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుంటారని అంటుంటారు. మరోసారి ఇదే విషయాన్ని పవన్ ధృవీకరించారు.
చాలా రోజుల సస్పెన్స్ తర్వాత జనసేన అధినేత తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై ప్రకటన వెలువడించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. ఈ విషయంపై టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ & కో అలిగినట్లు కనిపించినా.. అనంతరం బుజ్జగింపులు సక్సెస్ అవ్వడంతో పవన్ కు పొత్తులో భాగంగా ఎలాంటి సమస్య రాకుండా అయ్యిందనే కామెంట్లు వినిపించాయి.
ఆ సంగతి అలా ఉంటే… తాజాగా తాను పోటీ చేయబోయే స్థానంతో పాటు కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా… జనసేన నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ శ్రీనివాస్ పోటీచేస్తారని అన్నారు. ఇద్దరం భారీ మెజారిటీతో గెలవాలని సూచించారు. అక్కడితో ఆగిపోతే ఇంక పవన్ కల్యాణ్ మార్క్ పాలిటిక్స్ ప్రత్యేకత ఏముంది? అందుకే మరో కన్ ఫ్యూజన్ స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చారు!
ఇందులో భాగంగా తనను భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలిపించాలని.. వైసీపీ నేతలు కుటుంబానికి లక్ష రూపాయలు కూడా ఇచ్చి తనను ఓడించాలను చూస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత… మోడీ, అమిత్ షా ఆదేశిస్తే… తాను కాకినాడ ఎంపిగా పోటీచేస్తానని, అప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ బరిలోకి దిగుతారని అన్నారు. దీంతో… మరోసారి సందిగ్ధత మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాను ఎమ్మెల్యే అభ్యర్థా.. ఎంపీ అభ్యర్థా అనే విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ క్రియేట్ చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీని కన్ ఫ్యూజన్ లో పెట్టడానికి ఈ ఆలోచన అనే వాదన ఉన్నప్పటికీ… కేంద్రంలో మంత్రి పదవి అనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో… కాకినాడ ఎంపీగా పోటీ అనే విషయాన్నీ లైట్ తీసుకోలేని పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా అస్పష్టతకు మించిన అనర్ధం రాజకీయాల్లో మరొకటి ఉండదనే భావించాలి.
మరోపక్క… పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకోవాలని, ఒకపక్క పరిపాలనలో అనుభవాన్ని గడిస్తూనే.. మరోపక్క పార్టీని ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ లో బలపరచుకోవాలని జనసైనికులు కోరుకుంటున్న నేపథ్యంలో… మోడీ, అమిత్ షా ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడాన్ని.. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కూడా ఇలా మాట్లాడటాన్ని ఎలా భావించాలో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట జనసైనికులు.