Pawan Kalyan: అదానీ జగన్ ముడుపుల వ్యవహారం… సంచలన విషయాలు బయటపెట్టిన పవన్!

Pawan Kalyan:అదానీ కేసుల వ్యవహారం ప్రస్తుతం అమెరికాలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది.అదానీ రెండు తెలుగు రాష్ట్రాలకు ముడుపుల రూపంలో భారీగా లంచం ఇచ్చారని అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిల్క్ యూనివర్సిటీ కోసం అదానీ నుంచి 100 కోట్ల రూపాయలు విరాళంగా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై బిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తాను విరాళంగా తీసుకున్న 100 కోట్ల రూపాయలను వెనక్కి తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరోవైపు ఏపీలో కూడా ఈ వ్యవహారం పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పంద సంస్థలలో భాగంగా అదానీ నుంచి ఏకంగా 1750 కోట్ల రూపాయల ముడుపులను అందుకున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ విషయంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అలాగే కూటమి నేతలు కూడా పలు సందర్భాలలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలను బయటపెట్టారు.

ఇదిలా ఉండగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయం గురించి మాట్లాడారు. త్వరలోనే అదానీ జగన్ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడుతో కూర్చుని సుదీర్ఘ చర్చలు జరుపుతామని, ఇలా ఆలోచన చేసిన తర్వాతనే ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే జగన్ చేసుకున్న ఒప్పందాల గురించి కూడా విచారణ చేపడతామని వెల్లడించారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో తప్పులు జరిగాయి. ప్రస్తుతం ఆ తప్పులను మేము సరిదిద్దుకోవాల్సి వస్తుందని పవన్ మండిపడ్డారు. గత ఐదు సంవత్సరాల కాలంలో వైకాపా ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా వ్యవహరించిందని కేవలం సమోసాల కోసమే 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటూ పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.