జనసైనికులకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో ఇతర పార్టీలు, ప్రధానంగా వైసీపీ కార్యకర్తల సెటైర్లు తట్టుకోవడం వారివల్ల కావడం లేదని అంటున్నారు. అధినేత సీటుపై సందిగ్ధత నెలకొనడంతో జనసైనికులు మరింత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పోటీ చేయబోయే స్థానం కన్ ఫాం అయ్యింది. ఈ మేరకు ఒకవర్గం మీడియా ఈ విషయాన్ని ధృవీకరించినంత పనిచేసింది కాబట్టి.. కన్ ఫాం చేసేసుకోవచ్చు!
2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో భీమవరం, ఉత్తరాంధ్ర జిల్లాలోని గాజువాక నియోజకవర్గాలనుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. సరే రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారన్న విషయం కాసేపు పక్కనపెడితే… మరోసారి ఆ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుంచైనా పోటీ చేస్తారని.. తన సత్తా చాటుతారని అంతా భావించారు. ఇందులో భాగంగా పవన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ భీమవరం అనే మాటలు వినిపించాయి. ఇది ఆల్ మోస్ట్ కన్ ఫాం అనే కామెంట్లూ తెరపైకి వచ్చాయి.
అయితే… అనూహ్యంగా ఆ టిక్కెట్ పవన్ కి ఇవ్వడానికి బాబు అంగీకరించలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు.. సర్వే ఫలితాలను కారణంగా చూపించిన చంద్రబాబు… ఆ టిక్కెట్ నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పోటీచేయబోతున్నారని చెప్పినట్లు సమాచారం. అయితే ఆ టిక్కెట్ కూడా టీడీపీకి ఇస్తే ఇక జనసైనికుల రచ్చ మరింత పీక్స్ కి చేరే అవకాశం ఉందని భావించిన బాబు… అంజిబాబును ఒకటి రెండు రోజుల్లో జనసేనలోకి పంపించి.. అక్కడ నుంచి పోటీకి నిలబెడతారని అంటున్నారు.
ఈ స్థాయిలో పవన్ ని బొమ్మని చేసి అటు టీడీపీని, ఇటు జనసేననీ నడిపిస్తున్న చంద్రబాబు రాజకీయ చాణక్యం.. అందుకు మనోహర్ సహాయ సహకారాలు అంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి పక్కనపెడితే… ఇప్పుడు పవన్ ని ఈస్ట్ గోదావరికి పంపుతున్నారనే విషయం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయింది. ఇందులో భాగంగా… పవన్ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
పైగా ఈ విషయం టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన మీడియాలో కూడా రావడంతో.. ఈ విషయాన్ని కన్ ఫాం చేసేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. పైగా… పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే, తాను త్యాగానికి సిద్ధం అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించడంతో… పార్టీలో కూడా ఇక తనకు సమస్య ఉండదని భావించి.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీంతో… పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ అనే అంశం ఆల్ మోస్ట్ కన్ ఫాం అని అంటున్నారు.
కాగా… పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓట్లు సుమారు 91 వేల వరకూ ఉన్నాయని, ఫలితంగా పవన్ కల్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తే ఇక ఆయన గెలుపుకు తిరుగుండదని ఒక వర్గం మీడియా కథనాలు వండి వార్చేస్తుంది! అయితే… 24 సీట్ల ప్రకటన అనంతరం కాపుల ఓట్లు అంత వన్ సైడ్ గా పడే అవకాశాలు ఆల్ మోస్ట్ లేవనే కామెంట్లూ తెరపైకి వస్తున్నాయి. పైగా ఇక్కడ తేడా వస్తే.. ఆ ప్రభావం కాకినాడ లోక్ సభ స్థానం మీద పడే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు!
ఇక వైసీపీ విషయానికొస్తే… ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో ఈసారి ఎంపీ వంగా గీత పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరి మధ్యా పోరు ఏస్థాయిలో ఉండబోతుందనేది వేచి చూడాలి! కాగా.. గడిచిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీకి 83,459 ఓట్లు రాగా.. టీడీపీకి 68,470.. జనసేనకు 28,011 ఓట్లు దక్కిన సంగతి తెలిసిందే. మరి పిఠాపురంలో పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!!