వైజాగ్ – గోపాలపట్నం పరిసరాల్లోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన తొమ్మిది ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. ఇందులో పలువురికి వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు. స్టెరిన్ గ్యాస్ లీకేజీతో ఊపిరి ఆడక ఎంతోమంది అస్వస్థతకు గురవ్వడంతో పరిస్థితి సీరియస్ గా ఉందన్న సమాచారం నేటి ఉదయం అందింది. ఘటన అనంతరం 3-4 గంటలకు కానీ బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియరాలేదు. తెల్లవారు ఝామున 2.30 గంటలకు ఘటన జరిగితే దానికి సంబంధించి 5.45 నిమిషాలకు సంబంధిత అధికారులకు సమాచారం అందడం ఆశ్చర్యపరుస్తోంది.
ఇకపోతే ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియోని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం సంచలనమైంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాధితులకు 10లక్షలు .. ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికి లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియో అందిస్తామని జగన్ ప్రకటించారు. అలాగే ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో జంతువులు మరణించాయి. ప్రతి జంతువుకు 25 వేలు చొప్పున ఆయా కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు. ఇక ఈ గ్యాస్ దుర్ఘటన వల్ల దాదాపు 15,000 మంది ఎఫెక్ట్ అయ్యారని ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఘటనపై ఓ కమిటీ విచారిస్తోందని పూర్తి రిపోర్ట్ వచ్చాక చర్యలు చేపడతామని జగన్ తెలిపారు. బాధితులకు సదరు కంపెనీ నుంచి ఆర్థిక సాయం అందేలా చేస్తామని భరోసానిచ్చారు. ఇక ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు బాధిత కుటుంబాలకు అదే కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా సీఎం వెల్లడించారు. కంపెనీ నుంచి రాబట్టాల్సినంతా రాబట్టే బాధ్యత తనకు ఉందని అన్నారు.
నిజానికి ఇలాంటి ఘటనల్లో ప్రకృతి విపత్తుల వేళ మరణించిన వారి కుటుంబాలకు ఇన్నేళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం ప్రకటించనంత గొప్ప ఎక్స్ గ్రేషియోని సీఎం జగన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది.