బాలకృష్ణకు నోటీసులు..పోలింగ్ కేంద్రంలో ప్రచారం

నిబంధనలున్నవి ఉల్లంఘించటానికే అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. ఒక నియమం లేదు నిబంధన లేదు టిడిపికి. ఇంతకాలం సర్వ వ్యవస్ధలను భ్రష్టు పట్టించిన చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలు తాజాగా ఎన్నికల నిబంధనలను కూడా లెక్క చేయటం లేదు. పోలింగ్ కేంద్రాల్లో ప్రచారం చేయటం నిబంధనలను విరుద్ధం. కానీ టిడిపి నేతలు మాత్రం అదే పనిచేస్తున్నారు.

హిందుపురంలో పోస్టల్ బ్యాలెట్లు వేసేందుకు సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న సిబ్బందికి ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి వేయించటం మామూలే. అదే విధంగా ఉదయం నుండి ఉద్యోగులు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. దాంతో వెంటనే అక్కడకు టిడిపి అభ్యర్ధి కమ్ చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు.

పోలింగ్ కేంద్రానికి చేరుకున్న బాలయ్య వెంటనే ప్రచారంలోకి దిగేశారు. ఎప్పుడైతే బాలయ్య ప్రచారం మొదలుపెట్టారో వెంటున్న టిడిపి నేతలు కూడా ప్రచారం చేశారు. క్యూలైన్లో ఉన్న ఉద్యోగుల దగ్గరకు వెళ్ళి మరీ బాలయ్య తనకే ఓట్లు వేయాలని చెప్పటం గమానార్హం. అక్కడే ఉన్న వైసిపి అభ్యర్ధి ఇక్బాల్ , నేతలు అభ్యంతరం చెప్పినా బాలయ్యతో పాటు నేతలు, పోలింగ్ అధికారులు కూడా పట్టించుకోలేదు.

దాంతో విషయాన్ని వైసిపి నేతలు రిటర్నింగ్ అధికారి గుణభూషణ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న రిటర్నింగ్ అధికారి బాలకృష్ణకు నోటీసులు ఇస్తానని ప్రకటించారు. మంగళగిరిలో ఇదే విధంగా జరిగింది. అభ్యర్ది నారా లోకేష్ తరపున టిడిపి నేతలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి ప్రచారం చేశారు. ఇక రాప్తాడులో అయితే ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయటంపై ఉద్యోగులు మండిపోయారు. అయినా ఉపయోగం లేకపోవటంతో చేసేది లేక అక్కడే బారులు తీరారు. అధికారం ఉంది కదాని టిడిపి నేతలు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నా అధికారులు మాత్రం మౌనంగా చూస్తుండటమే విచిత్రంగా ఉంది.