తెలుగుదేశంపార్టీకి చెందిన నేతల్లో ఆ ఇద్దరికి మాత్రం ఎంట్రీ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లే ఉంది. ఇద్దరు మినహా మిగిలిన నేతలంతా తమ పార్టీలోకి వచ్చేయాలంటూ బిజెపి బహిరంగ పిలుపిచ్చింది. టిడిపికి భవిష్యత్తు లేదు కాబట్టి తమ పార్టీలోకి వచ్చేయాలని కమలంపార్టీ నేతలు ఆహ్వానించటమే గమనార్హం.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి తర్వాత చాలామంది నేతలకు చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం పోయింది. అందుకే ముందుగా వైసిపిలో చేరాలని అనుకున్నారు. అయితే వలసలకు జగన్ గేట్లు తెరవకపోవటంతో నేతల చూపు బిజెపి వైపు మళ్ళింది. దాంతో చాలామంది బిజెపిలో చేరటానికి రెడీ అయిపోతున్నారు.
అదే విషయాన్ని బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ టిడిపి నేతలందరూ తమ పార్టీలో చేరాలంటూ పిలుపిచ్చారు. అయితే ఆయన ఓ షరతు కూడా విధించారు. అదేమిటంటే తమ పార్టీలోకి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ కు మాత్రం ఎంట్రీ లేదట. అత్యంత అవినీతి నేతైన చంద్రబాబుకు మాత్రం ఎంట్రి ఇవ్వదలచుకోలేదన్నారు.
చంద్రబాబు, లోకేష్ ను పార్టీలోకి చేర్చుకునే విషయంలో తమ అగ్రనేతలు కూడా సానుకూలంగా లేరని వీర్రాజు చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజానికి చంద్రబాబు కానీ లోకేష్ కానీ బిజెపిలో చేరే ఆలోచన చేసినట్లు ఎక్కడా వినబడటం లేదు. అయినా చంద్రబాబు, లోకేష్ కు బిజెపిలో చేరాల్సిన అవసరం ఏముంది ? టిడిపి వాళ్ళ సొంత ఆస్తి అయినపుడు అందులో ఉండేవాళ్ళుంటారు వెళ్ళేవాళ్ళు వెళతారు.