నెల్లూరు రాపూరులో ఖాకీల పహారా… టెన్షన్ టెన్షన్

   

నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై బుధవారం సాయంత్రం జరిగిన దాడి ఘటనను విచారించేందుకు గుంటూరు రేంజ్ ఐజీ వేణుగోపాల్, ఎస్పీ రామకృష్ణ రాపూరు కు చేరుకున్నారు. రాపూరు లో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాజేష్ అనే యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగా అతనిని పోలీసులు, ఎస్సై లక్ష్మీకాంతరావు తీవ్రంగా కొట్టారని రాజేష్ బంధువులు, గ్రామస్థులు స్టేషన్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఎస్పైతో పాటు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు స్టేషన్ పే దాడి చేసిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

 

స్టేషన్ ను పరిశీలిస్తున్న ఐజీ వేణుగోపాల్ 

ఈ విషయం తెలుసుకున్న ఐజీ వేణుగోపాల్.. రాపూరు పోలీస్ స్టేషన్ లో విచారించారు. పోలీస్ స్టేషన్ పై దాడి జరగడం దురదృష్టకరమని, పోలీసు సిబ్బందిపై దాడి చేయడంతో ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారని ఆయన అన్నారు. ఎస్సైకి 8 కుట్లు పడ్డాయని, మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయని అందరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దాడిలో 50 మంది పాల్గొన్నట్టు గుర్తించామని, ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని, మరికొంత మందిని త్వరలో పట్టుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రాపూర్ లో ఇంకా కూడా టెన్షన్ వాతావరణమే నెలకొంది. పోలీసులు మోహరించటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంలో ప్రజలు ఉన్నారు.