వెంకటగిరి మున్సిపాల్టికి భర్తల చిచ్చు

నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్పిపాలిటీలో గ్రూపుల వార్ నడుస్తుంది. అధికార టిడిపి ఎమ్మెల్యే, మున్పిపల్ చైర్మన్ల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు సై అంటే సై అనేలా పోరుకు సిద్దమవుతున్నారు. మున్పిపల్ చైర్మన్ దొంతు శారదపై అవిశ్వాసం పెట్టడానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వర్గీయులు పావులు కదుపుతున్నారు.

వెంకటగిరి మున్సిపాలిటీలో టిడిపి అధిక స్థానాలు గెలవడంతో బీసీ వర్గానికి చెందిన దొంతు శారద మున్పిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆది నుంచి కూడా ఈమే తన స్వంత నిర్ణయాలతో ముందుకెళ్తుంది. ఇది ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు నచ్చలేదు. ఆమెకు ఎలాగైనా చెక్ పెట్టాలని ఎమ్మెల్యే భావించాడు. మహిళా కౌన్పిలర్ల భర్తలను తన వైపు తిప్పుకొని వారి సహకారంతో చైర్మన్ ను పదవి నుంచి దించాలనుకున్నాడు. వైస్ చైర్మన్, తన అనుచరుడైన బీరం రాజేశ్వరరావు సహకారంతో మున్సిపల్ కౌన్పిలర్లను ఎమ్మెల్యే రామకృష్ణ తన వైపుకు తిప్పుకున్నాడు.

ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కౌన్సిలర్లకు నిధులు ఎరగా చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.15 కోట్లు, గ్రాంట్ నిధులు తాయిలాలుగా చూపి ఎమ్మెల్యే కౌన్సిలర్లను తన వైపు మళ్లించుకున్నాడని చైర్మన్ వర్గీయులు అంటున్నారు. 21 మంది సభ్యులుగా ఉన్న మున్సిపల్ లో 12 మంది కౌన్సిలర్లను ఎమ్మెల్యే తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఎమ్మెల్యే, చైర్మన్ లు అవినీతి చేస్తున్నారని పేపర్లో, ఛానల్ లలో వార్తలు వచ్చాయి. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే వర్గీయులు సోషల్ మీడియాలో మున్సిపల్ చైర్మన్ పై పలు పోస్టులు చేశారు. దీనికి ప్రతీగా మున్సిపల్ చైర్మన్ వర్గీయులు ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ పలు పోస్టులు చేశారు. దీంతో ఎమ్మెల్యే.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి తీవ్రంగా చితకబాదారు. అది చాలా ఉద్రిక్తతకు దారి తీసింది.
మహిళా మున్సిపల్ కౌన్సిలర్ల భర్తలు ఎమ్మెల్యేకు అనుకూలంగా మారడంతో పట్టు మీదున్న ఎమ్మెల్యే వారితో అవిశ్వాసానికి సంతకాలు సేకరిస్తున్నారు. ఈ ఆదివారం మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్దమవుతున్నారు. అవిశ్వాసానికి తాను కూడా సిద్దమేనని చైర్మన్ శారద పోరుకు రెడీ అవుతున్నారు. ఇద్దరు అధికార నేతల మధ్యే పోరు నడుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అవిశ్వాసం పెడితే ఎవరూ గెలుస్తారు, కౌన్సిలర్లు ఎవరి పక్షాన నిలబడనున్నారనే ఉత్కంఠ నెల్లూరు జిల్లాలో నెలకొంది.